అమెరికాలో 5జీ సేవలపై విమానయాన సంస్థల గగ్గొలు.. 8 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా

ABN , First Publish Date - 2022-01-20T13:11:09+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి రాకపోకలు సాగించే 8 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. దీంతో వాటిలో టికెట్లు బుక్‌ చేసుకున్న వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ నుంచి యూఎస్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు విమాన సర్వీసు..

అమెరికాలో 5జీ సేవలపై విమానయాన సంస్థల గగ్గొలు.. 8 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా

అమెరికాలో 5జీ సేవలకు కేటాయించిన స్పెక్ట్రమ్‌పై విమానయాన సంస్థల అభ్యంతరం

అమెరికాకు రాకపోకలు సాగించే ఎనిమిది విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా

న్యూఢిల్లీ, శంషాబాద్‌, వాషింగ్టన్‌, జనవరి 19: అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి రాకపోకలు సాగించే 8 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. దీంతో వాటిలో టికెట్లు బుక్‌ చేసుకున్న వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ నుంచి యూఎస్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు విమాన సర్వీసు రద్దు కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిరిండియాలాగానే.. దుబాయ్‌ ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ తదితర విమానయాన సంస్థలు కూడా అమెరికాకు రాకపోకలను నిలిపివేయడంతో అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో 5జీ ఇంటర్‌నెట్‌ సేవలకు కేటాయించిన బ్యాండ్‌ (3.7-3.98 గిగాహెర్ట్జ్‌).. విమానాల ల్యాండింగ్‌లో కీలకమైన రేడియో అల్టీమీటర్లు పనిచేసే బ్యాండ్‌ (4.2-4.4 గిగాహెర్ట్జ్‌) ఫ్రీక్వెన్సీలు చాలా దగ్గరగా ఉండడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. 


ఇలా ఉండడం వల్ల విమానంలోని రేడియో అల్టీమీటర్ల పనితీరు దెబ్బతిని ఇంజన్‌, బ్రేకింగ్‌ వ్యవస్థలు ల్యాండింగ్‌ మోడ్‌లోకి మారకుండా నిరోధిస్తాయని.. ఫలితంగా విమానాలు రన్‌వేపై దిగవని... అమెరికా ‘ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)’ జనవరి 14న హెచ్చరించింది. అల్టీమీటర్ల పనితీరు దెబ్బతింటే విమానయాన రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందంటూ అమెరికాకు చెందిన విమానయాన సంస్థలన్నీ కలిసి ‘ఎఫ్‌ఏఏ’కి ఒక లేఖ రాశాయి. అదే సమయంలో.. 5జీ, విమానాల రేడియో అల్టీమీటర్ల ఫ్రీక్వెన్సీలు చాలా దగ్గరగా ఉండడంపై అమెరికన్‌ టెలికం దిగ్గజాలు ఏటీ అండ్‌ టీ, వెరిజాన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్య కారణంగానే ఆ రెండు సంస్థలూ ఇప్పటికే రెండుసార్లు 5జీ సేవల ప్రారంభాన్ని వాయిదా వేశాయి. తాజా ఆందోళన నేపథ్యంలో కొన్ని విమానాశ్రయాల వద్ద తమ సేవలను వాయిదా వేయడానికి అంగీకరించాయి. మిగతా చోట్ల తమ 5జీ ప్రారంభిస్తామని తెలిపాయి.


ఇతరదేశాల్లో పరిస్థితి ఏంటి?

అమెరికా మినహా ఇప్పటికే 5జీ సేవలు అందిస్తున్న 40 దేశాల్లో.. 5జీ సేవలకు స్పెక్ట్రమ్‌ను కేటాయించిన దేశాల్లో ఈ సమస్య రాలేదు. ప్రస్తుతానికి అమెరికాలో 50 విమానాశ్రయాలను తాత్కాలిక బఫర్‌ జోన్లుగా ఎఫ్‌ఏఏ ప్రకటించింది. అంటే అక్కడ 5జీ సేవలు లభించవు. స్పెక్ట్రమ్‌ ప్రభావానికి గురయ్యే అల్టీమీటర్లను కూడా మారుస్తోంది. కేవలం జీపీఎస్‌ ఆధారంగా విమానాలను ల్యాండింగ్‌ చేసే అవకాశం ఉన్న ఎయిర్‌పోర్టులనూ గుర్తిస్తోంది. అయితే, విమానాశ్రయాల చుట్టూ కనీసం 2 మైళ్ల వ్యాసంలో 5జీ నెట్‌వర్క్‌లు ఉండకూడదని విమానయాన సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - 2022-01-20T13:11:09+05:30 IST