ఇలా అలవాటు చేయండి!

ABN , First Publish Date - 2020-12-02T05:36:33+05:30 IST

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించాలని తల్లులు ఎంతో ఆరాటపడతారు. తాజా పండ్లు, రకరకాల కూరగాయలు తినేందుకు కొందరు పిల్లలు ఇష్టం చూపరు. అయితే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం మీద ఇష్టం పెరిగేందుకు...

ఇలా అలవాటు చేయండి!

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించాలని తల్లులు ఎంతో ఆరాటపడతారు. తాజా పండ్లు, రకరకాల కూరగాయలు తినేందుకు కొందరు పిల్లలు ఇష్టం చూపరు. అయితే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం మీద ఇష్టం పెరిగేందుకు వారికి చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహార, జీవనశైలిని అలవాటు చేయడం చాలా ముఖ్యం. అందుకు ఏం చేయాలంటే... 


  1. పిల్లలు ఏ విషయాన్నైనా అనుసరించి నేర్చుకుంటారు. ముందుగా తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరించి చూపాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యమైన జీవనశైలి వల్ల కలిగే లాభాలను గ్రహిస్తారు.
  2. వంట చేసేటప్పుడు పిల్లలను భాగస్వాములను చేయాలి. వంటకు ఉపయోగించే  పదార్థాలు ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయో చెబుతుండాలి. కూరగాయలు అందించడం, వంట అయ్యాక అందరికీ వడ్డించడం వంటి పనులు చెప్పాలి. దాంతో మంచి ఆహారం మీద ఆసక్తి పెరుగుతుంది. 
  3. భోజనవేళలతో పాటు స్నాక్‌ టైమ్‌ కూడా ముఖ్యమే. అయితే పిల్లలతో ‘నువ్వు హోమ్‌వర్క్‌ త్వరగా చేస్తే చాక్లెట్‌ ఇస్తా, చిప్స్‌ ఇస్తా’ అని వారికి అలవాటు చేయొద్దు. ఇంట్లో తయారుచేసిన స్నాక్స్‌నే వారికి ఇవ్వాలి. 
  4. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేయడం పిల్లలకు ఇష్టమైన ఆహారంతో మొదలుపెట్టాలి. పాలలో పిల్లలకు ఇష్టమైన చాకొలెట్‌ పౌడర్‌తో పాటు డ్రై ఫ్రూట్స్‌ వేసి ఇస్తే వాళ్లు ఇష్టంగా తాగుతారు. 
  5. పిల్లలు పెరిగే కొద్దీ వారికి ఇష్టమైనవీ, ఇష్టం లేనివీ ఏడిటో చెబుతుంటారు. అందుచేత ‘ఆరోగ్యానికి మంచివి  కాబట్టి ఇవి తిను’ అని వారిని ఒత్తిడి చేయవద్దు. వాళ్లకు ఇష్టమైన ఆహారంలోనే ఆరోగ్యానికి దోహదపడేవాటివి ఇవ్వండి.

Updated Date - 2020-12-02T05:36:33+05:30 IST