Jun 17 2021 @ 20:05PM

ఈ దీపావళికైనా అజిత్‌ ‘వలిమై’ వచ్చేనా?

హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘వలిమై’. హ్యూమా ఖురేషీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం అప్‌డేట్స్‌ కోసం అజిత్‌ అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. పైగా లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ కూడా సాఫీగా సాగడం లేదు. అదేసమయంలో చిత్రంలో నటించే సీనియర్‌ నటీనటులు కరోనా రెండోదశ వ్యాప్తి భయంతో నటించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసి రీషూట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ తెలుపుతుంది. కానీ పరిస్థితులు ఇంకా చక్కబడాలి. అందరూ షూటింగ్‌కి సపోర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్‌ అంతా జరిగితేనే చిత్రయూనిట్‌ చెప్పిన దీపావళికి ఈ సినిమా విడుదలవుతుంది. లేదంటే వచ్చే సంవత్సరం సంక్రాంతికే అనేలా కూడా వార్తలు నడుస్తున్నాయి.


ఈ చిత్ర షూటింగులో భాగంగా ఒక ఫైట్‌ సన్నివేశాన్ని షూట్‌ చేయాల్సి ఉందని చిత్రయూనిట్‌ చెబుతుంది. వాస్తవానికి కథాపరంగా ఈ ఫైట్‌ విదేశాల్లో చిత్రీకరించాలి. కానీ, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విదేశాలకు వెళ్ళేందుకు వీలుపడకపోవడంతో లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఫైట్‌ సన్నివేశాన్ని చిత్రకరించాలని భావిస్తున్నారు. ఒకవేళ అప్పటికీ సాధ్యపడకపోతే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తామని నిర్మాతలు అంటున్నారు. అలాగే, చిన్నచిన్న ప్యాచ్‌ వర్క్స్‌ కూడా మిగిలివున్నాయని, వీటిని త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కరోనా లాక్‌డౌన్‌ పూర్తికాగానే యధావిధిగా ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసి ముందుగా అనుకున్న ప్రకారం దీపావళికి విడుదల చేస్తామని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.