మఖానా కర్రీ

ABN , First Publish Date - 2020-05-16T15:02:35+05:30 IST

మఖానా (తామర గింజలు) - కప్పు, పచ్చి బఠాణీ - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో ప్యూరీ - కప్పు, కారం - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - టేబుల్‌స్పూన్‌,

మఖానా కర్రీ

కావలసినవి: మఖానా (తామర గింజలు) - కప్పు, పచ్చి బఠాణీ - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో ప్యూరీ - కప్పు, కారం - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - టేబుల్‌స్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, గరంమసాలా - టీస్పూన్‌, జీలకర్ర - పావు టీస్పూన్‌, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - గార్నిష్‌ కోసం. 


పేస్టు కోసం : ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - ఐదు రెబ్బలు, గసగసాలు - ఒక టీస్పూన్‌, జీడిపప్పు - ఐదు పలుకులు, నూనె - సరిపడా.


తయారీ: ముందుగా పేస్టు తయారీ కోసం పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి.

అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. బాగా వేగిన తరువాత స్టవ్‌ పైనుంచి దింపాలి. గసగసాలు, జీడిపప్పు వేసి కలియబెట్టాలి. 

చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పొసి మెత్తటి పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో తామరగింజలు వేసి చిన్నమంటపై వేగించాలి. కాసేపు వేగిన తరువాత ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టాలి.

అదే పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత రెడీ చేసి పెట్టుకున్న పేస్టు వేసి చిన్నమంటపై రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. కొద్దిసేపటికి టొమాటో ప్యూరీ, కారం, ధనియాలపొడి, పసుపు వేసి కలియబెట్టాలి. మూతపెట్టి చిన్నమంటపై ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. 

బఠాణీలు వేసి తగినంత ఉప్పు చల్లుకుని కాసిన్ని నీళ్లు పోసి మరో మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి.

ఇప్పుడు వేగించి పెట్టుకున్న తామర గింజలు వేయాలి. చిన్నమంటపై మరికాసేపు ఉడకనివ్వాలి. చిక్కటి గ్రేవీ తయారవుతుంది. 

చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపాలి. ఈ కూరచపాతీలోకి లేదా పులావ్‌లోకి రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-05-16T15:02:35+05:30 IST