మహాదానం

ABN , First Publish Date - 2020-07-24T05:30:00+05:30 IST

మనం భరించలేనిదీ, మనస్సునూ, శరీరాన్నీ, బాధించేదీ, నష్టాన్నీ, కష్టాలనూ కొని తెచ్చేదీ ... ఇలాంటి దాన్ని వదిలి పెట్టేస్తే ఎవరికైనా సుఖంగానే ఉంటుంది. కానీ మనకు లాభాన్నీ, సుఖాన్నీ ఇచ్చే దాన్ని వదిలిపెట్టేస్తే ...

మహాదానం

మనం భరించలేనిదీ, మనస్సునూ, శరీరాన్నీ, బాధించేదీ, నష్టాన్నీ, కష్టాలనూ కొని తెచ్చేదీ ... ఇలాంటి దాన్ని వదిలి పెట్టేస్తే ఎవరికైనా సుఖంగానే ఉంటుంది. కానీ మనకు లాభాన్నీ, సుఖాన్నీ ఇచ్చే దాన్ని వదిలిపెట్టేస్తే (దానం చేస్తే) అమిత ఆనందాన్ని తెచ్చేదే దానం. అందుకే దాన్ని ‘త్యాగం’ అంటారు.  దానం సహజంగా ధన, వస్తు రూపంలో ఉంటుంది. జ్ఞాన రూపంలోనూ ఉంటుంది. తమ శ్రమను ఇతరులకు పంచడంలోనూ ఉంటుంది.


‘ఇచ్చుటలో ఉన్న హాయి, వేరెచ్చటనూ లేనే లేదని...’ అంటాడు ఆరుద్ర. అంటే, ఇవ్వడంలో కూడా అమితమైన ఆనందం ఉందనే గొప్ప తాత్త్వికమైన భావాన్ని ముత్యాల్లాంటి రెండు అచ్చ తెలుగు మాటల్లో చెప్పేశాడు. ‘ఇవ్వడం’ అంటే దానం చేయడమే! దీన్నే ‘దానానందం’ అంటారు. ‘దీయతే ఇతి దానం’ అన్న అమరకోశమే ‘త్యాగో విహాపితం దానముత్సర్జన విసర్జనే...’ అంది. ‘దానం’ అంటే త్యాగం... విడిచిపెట్టేది. సంపూర్తిగా విడిచిపెట్టేది. 

 శీల గుణంలో దానం ఒక ప్రధాన భాగంగా బుద్ధుడు చెప్పాడు. మనకు బాగా తెలిసిన బలి చక్రవర్తి గాథ జైనులదైతే, శిబి చక్రవర్తి కథ బౌద్ధంలోది. అనాథ పిండికుడు. విశాఖమాత, ఆమ్రపాలి, అశోకుడు, శ్రీహర్షుడు లాంటి మహా మహా దాతలను ఈ దేశానికి అందించింది బౌద్ధం. ‘‘దానం ఇవ్వాలనే ఆలోచన వచ్చినప్పుడూ, దానం చేస్తున్నప్పుడూ, దానం చేశాకా కూడా ఎవరైతే ఒకే రకమైన ఆనందాన్ని అనుభవిస్తారో వారే మహా దాత!’’ అంటాడు బుద్ధుడు. ‘‘ఎలాంటి భేదభావాలూ చూడకుండా, అర్హతలూ, అనర్హతలూ ఎంచకుండా దానం చేయాలి’’ అని ఆయన చెప్పాడు. అయితే, దాత, గ్రహీత... వీరిద్దరూ మంచివారైతే ఆ దాన ఫలం ఇనుమడిస్తుందని  వివరించాడు. ఆహార పదార్థాలూ, ధన, కనక, వస్తు వాహనాలూ... ఇలాంటివి సాధారణ దానాలనీ, శరీర భాగాలనూ, సమాజ శ్రేయస్సు కోసం ప్రాణాలనూ త్యాగం చేయడం పరమార్థ దాన పారమికి చెందిన అసాధారణ దానాలనీ బుద్ధుడు తెలిపాడు. మంచి వాడు ఒక చెడ్డవానికి చేసే దానం మంచి విత్తనాన్ని ఉప్పురికిన ఊసర క్షేత్రంలో నాటినట్టని ఆయన అన్నాడు. అంటే, అది మొలిచినా తగినంత ఫలించదు. అలాగే ఒక చెడ్డవాడు మంచివాడికి చేసే దానం మంచి క్షేత్రంలో నాటిన తాలు గింజ లాంటిదన్నాడు. అదీ సరిగ్గా ఫలితాన్ని ఇవ్వదు. ఫలితం కొద్దిగానే ఉంటుంది. మరి దాత, గ్రహీత.. వీరిద్దరూ మంచివారైతే ఆ దాన ఫలం మంచి నేలలో నాటిన మంచి విత్తనం లాంటిదనీ, దానివల్ల మంచి ఫలాలు వస్తాయనీ వివరించాడు.

బుద్ధుడు ఎనిమిది రకాల దానాల గురించి చెప్పాడు. కీర్తి కోసం చేసే దానం వాటిలో ఒకటి. 

ఒక ఊరిలో ఒక పెద్ద ఆసామీ ఉన్నాడు. అతను చాలా దానాలు చేశాడు. ప్రజలు సభలు పెట్టి మరీ అతని దాన గుణాన్ని ప్రశంసించేవారు. అతను మరింత ఆనందం పొంది, ఇంకా పెద్ద దానాలు చేశాడు. అతని దగ్గరే ఒక పనివాడు ఉన్నాడు. అతనికీ దానగుణం ఉంది. తన స్థాయికి తగినట్టు ఎందరో అభాగ్యులకు దానాలు చేశాడు. వారి కష్టాల్లో పాలుపంచు కొనేవాడు.

కొన్నాళ్ళకు ఇద్దరూ చనిపోయారు. దేవలోకం చేరారు. అక్కడ వారిద్దరికీ సన్మానాలు ఏర్పాటు చేశారు. ఇద్దరినీ పిలిచి ఒకే రకమైన కుర్చీల మీద కూర్చోబెట్టారు. ఒకే రకమైన దండలు ఇద్దరికీ వేశారు. ఇలా ఇద్దరినీ సమానంగా గౌరవించడం ఆసామీకి నచ్చలేదు. తరువాత ఇద్దరికీ బంగారు కిరీటాలు పెట్టారు. అయితే, ఆసామీకి పెట్టిన కిరీటం సాదాగా ఉంటే, పనివానికి పెట్టిన కిరీటం వజ్రాలతో పొదిగి ఉంది. 

ఇక, ఆసామీ ఉక్రోషం పట్టలేక ‘‘ఇదేం అన్యాయం?’’ అని దేవతలను అడిగేశాడు.

‘‘నాయనా! నీవు ఇతని కన్నా ఎక్కువే దానాలు చేశావు. నీకన్నా ఇతను తక్కువ దానాలే చేశాడు. కానీ, నీవు కీర్తి కోసం చేశావు. ఇతను ఎదుటివారి ఆర్తిని తీర్చడం కోసం దానం చేశాడు. వారి బాధలకు కరిగి కన్నీరు కార్చాడు. ఆ కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టే ఈ కిరీటంలోని ఒక్కొక్క వజ్రం’’ అని చెప్పారు.

శరీరాన్నీ, కళ్ళనూ దానం చేసిన శిబి చక్రవర్తి కథ బౌద్ధ సాహిత్యంలో ఉంది. అలాగే ఈనాడు ఎందరో శరీర అవయవాలను దానం చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో వైద్యులూ, నర్సులూ, పోలీసులూ తమ ప్రాణాలను లెక్క చెయ్యకుండా సేవలు చేస్తున్నారు. త్యాగం చూపిస్తున్నారు. అవి కూడా సమాజానికి వారు అందించే దానాలే!

- బొర్రా గోవర్ధన్‌




Updated Date - 2020-07-24T05:30:00+05:30 IST