బొమ్మల మణిహారం!

ABN , First Publish Date - 2020-02-22T06:17:54+05:30 IST

చాక్లెట్‌ కవర్‌, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌, ఆలౌట్‌ లిక్విడ్‌ బాటిల్‌, కొబ్బరి చిప్పలు... ఇలా ఏ వస్తువైనా వాడేసిన తర్వాత చెత్తలో కలిపేస్తాం!

బొమ్మల మణిహారం!

చాక్లెట్‌ కవర్‌, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌, ఆలౌట్‌ లిక్విడ్‌ బాటిల్‌, కొబ్బరి చిప్పలు... ఇలా ఏ వస్తువైనా వాడేసిన తర్వాత చెత్తలో కలిపేస్తాం! కానీ ఆమె మాత్రం వాటితో చూడముచ్చటైన బొమ్మలు తయారు చేస్తారు. క్విల్లింగ్‌ పేపర్‌తో బొమ్మలు, టెక్స్‌టైల్‌ డాల్స్‌ తయారు చేసి ‘ఔరా’ అనిపించుకున్నారు. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కిన ఒక ఈవెంట్‌లో కూడా ఆమె భాగస్వామ్యం ఉంది. నెల్లూరుకు చెందిన పాబోలు శారదామణిని ముచ్చటగొలిపే బొమ్మల ‘మణి’హారం అనొచ్చు. అసలు ఆమెకు ఈ కళ ఎలా అబ్బిందంటే...


‘‘మాది ప్రకాశం జిల్లా పామూరు. బీకాం కంప్యూటర్స్‌ వరకు చదివాక నెల్లూరువాసి పాబోలు సుబ్రహ్మణ్యతో వివాహమయ్యింది. మాకు ఇద్దరు సంతానం. పిల్లలు బడికి, ఆయన షాప్‌కు వెళ్లిన తర్వాత పగలంతా ఇంట్లో నేనొక్కదాన్నే ఉండాలంటే బోర్‌ కొట్టేది. దాంతో ఏదో చేయాలన్న తపన మొదలైంది. అప్పుడే ఓ ఆలోచన తట్టింది. ఇంట్లో వాడి పడేసిన చాక్లెట్‌ కవర్లు, వాటర్‌ బాటిళ్లు, ఆలౌట్‌ బాటిల్స్‌, న్యూస్‌ పేపర్స్‌ కనిపించాయి. వాటితో ఏదైనా చేద్దామని అనుకున్నా. అంతే ఆ మరుసటి రోజే కొన్ని బొమ్మలు తయారు చేశా. వాడేసిన పైపులతో ఫ్లవర్‌వాజ్‌లు.. ఫొటో ఫ్రేమ్‌లు... ఇలా ఒక్కటేమిటి నా మనసులో ఏం అనిపిస్తే వాటిని చకచకా చేసుకుంటూ పోయా. నా ఉత్సాహం చూసి ఇంట్లో వాళ్లు కూడా ప్రోత్సహించారు. 


క్విల్లింగ్‌ పేపర్లతో..

కొన్నాళ్ల తర్వాత ఇంకా ఏదైనా కొత్తగా తయారు చేయాలని అనిపించింది. మార్కెట్లో దొరికే సాధారణ రంగు కాగితాలను 3 నుంచి 12 మిల్లీ మీటర్ల వెడల్పుతో కట్‌ చేసి అమ్ముతూ ఉంటారు. నా దృష్టి వాటిపై పడింది. నాకు నేనుగా 5 ఎం.ఎం వెడల్పు కలిగిన క్విల్లింగ్‌ పేపరుతో బొమ్మలు తయారు చేయడం మొదలు పెట్టాను. వాటిలో 12 రాశులు, చిన్నారులు ఆడుకునే బొమ్మలు, దశావతారులు, భరతమాత, జంతు ప్రదర్శన శాల, సంగీత వాయిద్య పరికరాలు, పెళ్లి సందడి దృశ్యాలు, మూడు కోతుల బొమ్మలు, క్రీస్తు జననం దృశ్యాలు, జపనీస్‌ ఫ్యామిలీ బొమ్మలు, దేవతామూర్తులు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కొన్నాళ్లకు ‘క్విల్లింగ్‌ జ్యువెల్లరీ’  తయారు చేయడం మొదలు పెట్టాను. మొదట్లో కొంత ఇబ్బంది పడ్డా ఆ తర్వాత అలవాటయ్యింది. ఇంట్లో ఉండే చెత్తా చెదారం, వ్యర్థ పదార్థాలు, కొబ్బరి చిప్పలు... ఇలా వాడి పారేసే వస్తువులతో కూడా జ్యువెల్లరీ చేశా. త్రీడీ క్విల్లింగ్‌ బొమ్మలు తయారు చేసినందుకు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో నాకు చోటు దక్కింది. ఆ తర్వాత అనేక అవార్డులు అందుకున్నా. 


‘బాహుబలి’ బొమ్మలు...

పేపర్స్‌తోనే కాకుండా వస్త్రంతో కూడా సృజనాత్మకంగా బొమ్మలు తయారుచేయడం స్వయంగా నేర్చుకున్నా. వీటిలో ‘బాహుబలి’ నటీనటుల బొమ్మలు కూడా ఉన్నాయి. దేశంలో 15 రాష్ట్రాలకు చెందిన వధూవరుల బొమ్మలను కూడా చేశా. గత ఏడాది బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఇతర కళాకారులతో కలిసి 2500 బొమ్మలను ప్రదర్శించాం. ఈ ఈవెంట్‌కు ‘గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు లభించింది.’’ 


అనాథ పిల్లలకూ నేర్పుతున్నా..

హాబీగా నేర్చుకున్న ఈ కళను పిల్లలకూ నేర్పుతున్నా. ముఖ్యంగా అనాఽథ శరణాలయంలో ఉండే చిన్నారులకు ఈ కళ నేర్పడం వల్ల వారి జీవనోపాధికి ఉపయోగ పడుతుందని అనుకుంటున్నా. నా దగ్గర ఈ కళను నేర్చుకున్న కొందరు పిల్లలు ఆర్డ్‌ అండ్‌ క్రాఫ్ట్‌ పోటీలలో బహుమతులు కూడా గెలుచుకున్నారు. ‘క్విల్లింగ్‌’ పేపర్లతో తయారు చేసే బొమ్మలతో సోలోగా ‘గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌’ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నా. అందుకు అవసరమైన బొమ్మల తయారీలో బిజీగా ఉన్నా. ఏదో ఒకరోజు నా లక్ష్యాన్ని చేరుకుంటా.

గోళ్ల రామకృష్ణ, నెల్లూరు

ఫొటోలు: ఎస్‌.డి.జకీర్‌


Updated Date - 2020-02-22T06:17:54+05:30 IST