అరటితో అదరహో!

ABN , First Publish Date - 2020-02-15T05:51:01+05:30 IST

కూరగాయలు, ఆకుకూరలతో రెగ్యులర్‌ వంటలు బోర్‌కొడితే, కాస్త వెరైటీ కోసం అరటికాయలను ట్రై చేయొచ్చు. వీటిని కేవలం చిప్స్‌కే పరిమితం చేయకుండా, అరటికాయలతో అనేక రెసిపీలు ప్రయత్నించొచ్చు.

అరటితో అదరహో!

కూరగాయలు, ఆకుకూరలతో రెగ్యులర్‌ వంటలు బోర్‌కొడితే, కాస్త వెరైటీ కోసం అరటికాయలను ట్రై చేయొచ్చు. వీటిని కేవలం చిప్స్‌కే పరిమితం చేయకుండా,  అరటికాయలతో అనేక రెసిపీలు ప్రయత్నించొచ్చు. అరటికాయ గుజ్జు తీయగా ఉన్నప్పటికీ  మసాలా దట్టిస్తే ఎవరైనా ‘అదరహో’ అనాల్సిందే. అరటికాయలతో చేసే రైతా, కోఫ్తా, కుర్మా, పకోడీలతో పాటు హల్వాను పిల్లలు ఇష్టంగా తింటారు. ఆలస్యమెందుకు... అరటికాయలతో అదరగొట్టండి మరి!


అరటికాయ కోఫ్తా

కావలసినవి

అరటికాయలు - రెండు, వెన్న - అర టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, దాల్చినచెక్క పొడి - అర టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, అల్లం - చిన్న ముక్క, సోంపు పొడి - అర టీస్పూన్‌, గోధుమపిండి - ఒక టీస్పూన్‌, మొక్కజొన్న పిండి - ఒక టీస్పూన్‌, జున్ను - 150 గ్రాములు, పచ్చిమిర్చి - నాలుగైదు, డ్రై అంజీరా - మూడు, దానిమ్మ గింజలు - అరకప్పు, నిమ్మకాయ - ఒకటి, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత.

తయారీ

  • అరటికాయలను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి.
  • తరువాత వాటిని చల్లటి నీటిలో వేసి పొట్టు తీసి, గుజ్జుగా చేయాలి.
  • ఒక పాన్‌ తీసుకుని అరటికాయ గుజ్జు వేసి, వెన్న, ఉప్పు వేసి కలపాలి.
  • యాలకుల పొడి, దాల్చినచెక్క పొడి, సోంపు పొడి వేయాలి. దాల్చిన చెక్కపొడి, అల్లంను దంచి వేసి కలియబెట్టాలి. కాసేపు వేగనిచ్చి దించాలి.
  • ఒక పాత్రలో జున్ను, అంజీరా ముక్కలు, పచ్చిమిర్చి, దానిమ్మగింజలు, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి.
  • గోధుమపిండి, మొక్కజొన్నపిండి, వేగించి పెట్టుకున్న అరటికాయల గుజ్జు వేసి కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ కోఫ్తాలుగా చేసుకుంటూ నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.
  • చట్నీతో తింటే అరటికాయ కోఫ్తాలు రుచిగా ఉంటాయి.

బనానా రైతా

కావలసినవి

అరటికాయ - ఒకటి, పెరుగు - పావుకేజీ, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత.

తయారీ

  • కుక్కర్‌లో అరటికాయలు వేసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.
  • తరువాత పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి.
  • ఒక పాత్రలో పెరుగు తీసుకుని గట్టిగా లేకుండా గిలక్కొట్టాలి.
  • ఇప్పుడు అందులో అరటికాయ గుజ్జు, జీలకర్రపొడి, ఉప్పు వేసి కలపాలి.
  • ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు వేసి వేగించాలి.
  • ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. 
  • ఈ పోపుని రైతాపై పోయాలి.
  • వెజిటబుల్‌ బిర్యానీలో ఈ రైతా వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

బనానా హల్వా

కావలసినవి

అరటికాయలు - మూడు, పంచదార - 150గ్రాములు, నెయ్యి - ఐదు టేబుల్‌స్పూన్లు, పాలు - ఒకటిన్నరకప్పు, జీడిపప్పు - పది పలుకులు, బాదం - పది పలుకులు, యాలకుల పొడి - అర టీస్పూన్‌.

తయారీ

  • ముందుగా అరటికాయలను కుక్కర్‌లో ఉడికించాలి. తరువాత పొట్టు తీసి గుజ్జుగా చేయాలి.
  • జీడిపప్పు, బాదం పలుకులను ముక్కలుగా చేసుకోవాలి.
  • ఒక పాత్రలో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక అరటికాయ గుజ్జు వేసి వేగించాలి. 
  • తరువాత పాలు, పంచదార వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై ఉడికించాలి.
  • బాదంపలుకులు, జీడిపప్పు ముక్కలు వేయాలి. 
  • మిశ్రమం చిక్కగా అయ్యాక యాలకుల పొడి చల్లితే నోరూరించే బనానా హల్వా రెడీ.

పకోడీ

కావలసినవి

అరటికాయలు - ఆరు, జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఛాట్‌ మసాలా - ఒకటిన్నర టీస్పూన్‌, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి - ఆరు, నిమ్మకాయలు - నాలుగు, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, సెనగపిండి - అరకేజీ, బియ్యప్పిండి - 200 గ్రాములు, ఎండుమిర్చి - రెండు. 

తయారీ

  • అరటికాయల పొట్టు తీసి కట్‌ చేసి పెట్టుకోవాలి. 
  • ఒక పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండి తీసుకుని బాగా కలపాలి.
  • అందులో జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, ఛాట్‌ మసాలా, పచ్చిమిర్చి, మామిడికాయ పొడి, తగినంత ఉప్పు, మెత్తగా దంచిన అల్లం, ఎండుమిర్చి వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలియబెట్టాలి.
  • ఇప్పుడు ఒక పాన్‌లో నూనె పోసి వేడి అయ్యాక అరటికాయ ముక్కలను మిశ్రమంలో అద్దుకుంటూ నూనెలో వేసి వేగించాలి. 
  • చట్నీతో వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి. 

కుర్మా

కావలసినవి

అరటికాయలు - ఎనిమిది, బంగాళదుంపలు - అరకేజీ, పెరుగు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, నూనె - సరిపడా, టొమాటోలు - నాలుగు, క్రీమ్‌ - 300గ్రాములు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగైదు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌. 

తయారీ

  • ఒక పాన్‌లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి.
  • తరువాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేయాలి. 
  • కాసేపు వేగిన తరువాత పెరుగు వేయాలి. 
  • బంగాళదుంప ముక్కలు, అరటికాయ ముక్కలు వేసి కలపాలి. ఇవి లేత గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి పావు గంటపాటు చిన్నమంటపై ఉడికించాలి. 
  • టొమోటోలు బాగా ఉడికిన తర్వాత రుచికి తగ్గ కారం వేయాలి. ఈ మిశ్రమంలో క్రీమ్‌ వేసి కలుపుకోవాలి.
  • చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి అన్నంతో లేదా చపాతీతో ఈ కుర్మాను తినొచ్చు.

Updated Date - 2020-02-15T05:51:01+05:30 IST