నోబెల్ బహుమతి గ్రహీత Malala Yousafzai నిరాడంబరంగా నిఖా

ABN , First Publish Date - 2021-11-10T12:22:41+05:30 IST

నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది....

నోబెల్ బహుమతి గ్రహీత Malala Yousafzai నిరాడంబరంగా నిఖా

బర్మింగ్‌హామ్ : నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. మలాలా యూసఫ్‌జాయ్ తన బర్మింగ్‌హామ్ లోని ఇంట్లో జరిగిన వేడుకలో అస్సర్ అనే యువకుడిని వివాహం చేసుకున్నారు.నిఖా వేడుక అనంతరం తాను ఇప్పుడు వివాహితనని మంగళవారం మలాలా ప్రకటించారు.‘‘ఈ రోజు నా జీవితంలో ఎంతో విలువైన రోజు. అస్సర్, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. మేం మా కుటుంబాలతో బర్మింగ్‌హామ్‌లోని ఇంట్లో ఒక చిన్ననిఖా వేడుకను జరుపుకున్నాం. దయచేసి మీ ఆశీస్సులు, ప్రార్థనలను మాకు పంపండి. మేం భార్యాభర్తలుగా కలిసి నడవడానికి సంతోషిస్తున్నాం’’ అని మలాలా యూసఫ్‌జాయ్ ఒక ట్వీట్‌లో తెలిపారు. 


మలాలా తన భర్త అస్సర్‌తో దిగిన నిఖా వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పాకిస్థానీ ఉద్యమకారిణి

24 ఏళ్ల మలాలా యూసఫ్‌జాయ్ బాలికల విద్య కోసం ఉద్యమించారు.2012వ సంవత్సరంలో బాలికల విద్య ప్రాథమిక హక్కును సమర్థించినందుకు వాయువ్య పాకిస్థాన్‌లో తాలిబాన్లు మలాలా తలపై కాల్చడంతో ఆమె ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది.


బ్రిటన్ దేశంలో స్థిరపడిన మలాలా

బ్రిటన్ దేశంలో చికిత్స పొందిన మలాలా అక్కడే స్థిరపడ్డారు. పాకిస్థానీ ఉద్యమకారిణి మలాలా అత్యంత చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు.మలాలా పదహారేళ్ల వయసులోనే విద్యలో లింగ సమానత్వం ఆవశ్యకతపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు. 


అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్ల పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బందులపై మలాలా ఆందోళన వ్యక్తం చేశారు. మలాలాపై దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ మొదటిసారి విద్యా హక్కు బిల్లును రూపొందించింది. మలాలా తనపై జరిగిన దాడి,దాని అనంతర పరిణామాల గురించి ‘ఐ యామ్ మలాలా’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. 


Updated Date - 2021-11-10T12:22:41+05:30 IST