ప్రాణాంతకం.. హ్యాపీ హైపోక్సియా

ABN , First Publish Date - 2021-05-15T08:25:40+05:30 IST

అతని వయసు 21 ఏళ్లు.. అప్పటివరకు బాగానే ఉ న్నాడు. జ్వరం, దగ్గు, జలుబు ఇవేమీ లేవు.

ప్రాణాంతకం.. హ్యాపీ హైపోక్సియా

  • లక్షణాలు ఉండవు, కానీ ప్రమాదకరం.. 
  • శ్వాస ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి
  • చివరి క్షణాల్లో ఆసుపత్రులకు పరుగు
  • ఎక్కువగా బలవుతున్న యువత

 హైదరాబాద్‌ సిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): అతని వయసు 21 ఏళ్లు.. అప్పటివరకు బాగానే ఉ న్నాడు. జ్వరం, దగ్గు, జలుబు ఇవేమీ లేవు. నీరసం అసలే లేదు. ఆఫీసులో పనిచేస్తూ ఆకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకుపోయారు. అత్యవసర వార్డులో అడ్మిట్‌ చేసి ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సహాయంతో చికిత్సలు అందించినప్పటికీ కొద్దిగంటల్లోనే కన్నుమూశాడు. ఎందుకిలా జ రిగిందో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. అతని కి అప్పటికే కరోనా వైరస్‌ సోకిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వల్ల చనిపోయాడని వైద్యులు స్పష్టం చేశారు. దీన్ని వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది యువతలో ప్రా ణాంతక సమస్యగా మారుతోంది. దీనికితోడు ఏవైనా ఇతర జబ్బులు కూడా ఉంటే పరిస్థితి మరింత సీరియస్‌ అవుతోంది. 


శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరై తనువు చాలిస్తున్నారని వైద్యులు అంటున్నారు. కరోనాతో చనిపోతున్న యువకుల్లో ఎక్కువమంది దీనివల్లే మరణిస్తున్నారు. చాలా మందికి తమకు హ్యాపీ హైపోక్సియా ఉన్న విషయం కూడా తెలియడం లేదు. కానీ గుర్తించిన తర్వాత కేవలం అయిదారు గంటల్లోనే శరీరం మందగించి, అచేతనంగా మారుతోంది. చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతలో చాలామంది కరోనా పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇది పెద్ద సమస్యగా మారుతోందని చెబుతున్నారు. శాచ్యురేషన్‌ను చాలా ఆలస్యంగా గు ర్తించడం వల్ల అప్పటికే నష్టం జరిగిపోతుందని పే ర్కొంటున్నారు. దీన్ని ముందే గమనించి మందులువాడితే ముప్పు నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.  


అవయవాల పనితీరుపై ప్రభావం

రక్తంలో ఆక్సిజన్‌ సరఫరా తగ్గినప్పుడు హ్యాపీ హైపోక్సియా సమస్య ఉత్పన్నమవుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం, ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ తగ్గిపోవడంతో అవయవాల పనితీరు మందగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో యువత ఎక్కువగా హ్యాపీ హైపోక్సియా బారిన పడుతున్నారు. 


నీరసంగా ఉంటే నిర్లక్ష్యం వద్దు

హ్యాపీ హైపోక్సియా బాధితు ల్లో నీరసం ఎక్కువగా ఉంటుం ది. ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. యువకులు నీరసంగా ఉన్నా, ఇతర కరోనా  లక్షణాలు లేకపోవడంతో సమస్యను గుర్తిం చలేకపోతున్నారు.  

 డాక్టర్‌ ఎస్‌ఏ రఫీ,సీనియర్‌ పల్మానాలజిస్టు, కేర్‌ ఆస్పత్రి


చికిత్స ఆలస్యమైతే ప్రమాదం

ప్రతి కరోనా పేషంట్‌లో హ్యాపీ హైపోక్సియా ప్రధాన లక్షణంగా ఉంటుంది. చికిత్స కాస్త ఆలస్యమైతే ప్రాణహాని జరుగుతుంది. రక్తంలో చిన్న క్లాట్స్‌ ఏర్పడినప్పుడు ఊపిరితిత్తులలో ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది. తద్వారా మెదడుకు సంకేతాలు నిలిచిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడు నాలుగు రోజులు ఆలస్యం చేస్తే ఊపిరితిత్తులు దెబ్బతిని మరణానికి దారితీస్తుంది. .

  డాక్టర్‌ నరేష్‌, సీనియర్‌ రెసిడెంట్‌ పల్మనాలజిస్టు, చెస్ట్‌ ఆస్పత్రి

Updated Date - 2021-05-15T08:25:40+05:30 IST