వంద కోట్ల అవినీతి!

ABN , First Publish Date - 2020-09-25T08:35:33+05:30 IST

రూ. 100 కోట్లు. ఇదీ మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి కూడబెట్టిన అక్రమాస్తుల విలువ. అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో ఇప్పటికే బుధవారం రూ. 70కోట్ల ఆస్తులు బయటపడగా, గురువారం మరిన్ని వెలుగుచూశాయి...

వంద కోట్ల అవినీతి!

  • ఏసీపీ అక్రమాస్తుల విలువ అంచనా
  • చంచల్‌గూడ జైలుకు నర్సింహారెడ్డి  

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రూ. 100 కోట్లు. ఇదీ మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి కూడబెట్టిన అక్రమాస్తుల విలువ. అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో ఇప్పటికే బుధవారం రూ. 70కోట్ల ఆస్తులు బయటపడగా, గురువారం మరిన్ని వెలుగుచూశాయి. మొత్తంగా నర్సింహారెడ్డి ఆస్తుల విలువ రూ. 100కోట్లకు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్‌ చేశారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 25 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రాథమిక విచారణ అనంతరం గురువారం అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో.. చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.


లాకర్లో బయటపడ్డ బంగారం, పత్రాలు

బుధవారం నాటి తనిఖీల్లో నర్సింహారెడ్డికి రెండు బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గురువారం ఓ బ్యాంకు లాకర్‌ తెరచి 30 తులాల బంగారు ఆభరణాలు, కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. రియల్‌ ఎేస్టట్‌ వ్యాపారం నిర్వహిస్తున్న నర్సింహారెడ్డికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ. 8 కోట్లు విలువైన 4 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పుప్పాలగూడలో కుటుంబసభ్యుల పేరుతో వెంచర్‌, అనంతపురంలో వంద ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, నర్సింహారెడ్డిని పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ డీజీపీ మహేందర్‌ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


డీఐజీకి విల్లా...

ఖరీదైన మహేంద్ర హిల్స్‌లో ఓ విల్లాను డీఐజీ కొనుగోలు చేసేందుకు గాను నర్సింహారెడ్డి సహకరించాడు. ఆ తర్వాత సదరు విల్లాను డీఐజీ  అమ్మేసినట్లు తెలుస్తోంది. స్థిరాస్థి వ్యాపారం సంబంధంగానే నర్సింహారెడ్డి డీఐజీకి సహకరించాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.



కోట్లకు పడగలు

నర్సింహారెడ్డి సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన సోదరుడు వ్యవసాయ పనులు చేస్తుండగా, నర్సింహారెడ్డి పోలీసు ఉద్యోగంలో చేరారు. ఎస్సైగా ఎంపికైన తర్వాత మొదటి పోస్టింగ్‌లో గోల్కొండ పోలీస్‌ ేస్టషన్లో పనిచేశారు. ఆ తర్వాత టప్పాచబుత్రలో పనిచేసి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వెళ్లారు. ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన తర్వాత ఆయన భూ వివాదాల్లో తలదూర్చడం మొదలుపెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. ఘటేకేసర్‌ మండలంలోని ప్రతాప సింగారంలో ఓ భూ వివాదం పెద్దదిగా మారడంతో, నర్సింహారెడ్డి విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.


రెండు నెలల క్రితమే ఆయనకు సంబంధించిన అంతర్గత విచారణను జరిపిన అధికారులు, ఏసీబీకి సమాచారం అందించడంతో ఏకకాలంలో 25 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన నర్సింహారెడ్డి, ఎక్కడ భూ లావాదేవీలు నిర్వహించినా అక్కడి స్థానిక  నేతలతో కలిసి పనిచక్కబెట్టేవారని సమాచారం. బినామీల పేర్లతో ఆస్తుల కొనుగోలు, విక్రయాలు చేపట్టేవారని తెలుస్తోంది. తనవద్ద పనిచేేస వ్యక్తినే బినామీగా మార్చుకుని భూములు కొనడంతో.. అధికారులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఎవరెవరు బినామీలుగా ఉన్నారు? వారి పేర్ల మీద ఏమేం ఆస్తులు ఉన్నాయి అన్న వివరాలను రాబట్టే పనిలో ఏసీబీ ఉంది. 


Updated Date - 2020-09-25T08:35:33+05:30 IST