Abn logo
Mar 31 2020 @ 03:31AM

ఖుల్లా మాల్‌.. సరుకు నిల్‌

  • మరొక వారం ఇలాగే ఉంటే
  • మన వంటిళ్లలో కల్లోలమే
  • తెరిచారని షాపుల్లోకి వెళ్లి
  • తెల్లముఖాలతో బయటకి..
  • కూరలు మాత్రమే లభ్యం
  • ఇతర రాష్ట్రాల సరుకులన్నీ
  • రోడ్డుపై నిలిపివేతే కారణం
  • సప్లైచెయిన్‌ తెగి అవస్థలు
  • సరుకురాక గోదాము వెలవెల


అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ‘‘కూరలు, సరుకులు దొరకవేమొనన్న ఆందోళన అక్కర్లేదు. దేనికీ కొరత లేదు. తొందరగా వంటింటి సరుకులు తీసుకోవాలన్న ఆత్రుత అవసరం లేకుండా లాక్‌డౌన్‌ విరామాన్ని మధ్యాహ్నం ఒంటి గంట దాకా పొడిగిస్తున్నాం.. అప్పటిదాకా మీకోసం షాపులు, మాల్స్‌ తెరిచే ఉంటాయి’’ అని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటన తరువాత ఓ బడా అధికారి శనివారం ఉదయం ఏడు గంటలకు విజయవాడలోని ఓ ప్రముఖ కిరాణా స్టోర్‌కు వెళ్లారు. అదృష్టం...అది తెరిచే ఉంది. అడిగితే.. మధ్యాహ్నం దాకా తెరిచే ఉంచుతున్నామని అక్కడి పనివారు చెప్పారు. దీంతో సంతృప్తిగా ఆయన స్టోరులోకి అడుగుపెట్టారు. ఉప్పు, పప్పు, కాపీ పౌడర్‌, ఇతర సామాగ్రి ఉంచే ర్యాక్‌లన్నీ అక్కడ ఖాళీగా కనిపించాయి.  కూరగాయలు మాత్రం కనిపిస్తున్నాయి. సరుకులేవి? అంటే...వాటిని తీసుకొచ్చే వాహనం రాలేదని అక్కడి పనివారు బదులిచ్చారు. ఆ వెంటనే మరో స్టోర్‌కు వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి! మరో స్టోర్‌కు పరుగుపరుగున వెళ్లారు! అక్కడ మాత్రం ఒక టీ పౌడర్‌ లభించింది.  కేజీ కందిపప్పు కావాలంటే....పావుకిలో మాత్రమే ఇస్తామన్నారు. అదేమంటే...లోడ్‌ తీసుకురావాల్సిన వాహనం ఆపేశారు, ఎప్పుడు వస్తుందో తెలియదని సమాధానం! ఉన్న సరుకునే కొంచెం కొంచెం సర్దుబాటు చేస్తున్నామని ఆ అధికారికి వివరించారు. చేసేదేముంది.. ఇచ్చిన దాంతోనే ఆయన సంతృప్తిపడి బయటపడ్డారు. ఒక ఉన్నతస్థాయి అధికారికే ఈ పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి?


కూరగాయలు మినహా మిగతా నిత్యావసర సరుకులు స్థానికంగానేకాదు, ఎక్కువగా ఇతర ప్రాంతాలనుంచి రవాణా చేస్తుంటారు. బియ్యం, పప్పులు, ఉప్పు, మిర్చీ, నూనెలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి తెప్పించుకుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా వీటికి సంబంధించిన లారీలు, వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసరాల పంపిణీలో కీలకమైక సప్లై చెయిన్‌ దెబ్బతింటోంది. వాహనాల నిలిపివేత వల్ల  ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన సరుకులు నిలిచిపోయాయని వర్తకులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ మా దగ్గర ఉన్న సరుకు దాదాపుగా ఖాళీ అవుతోంది. స్టాక్‌ పాయింట్లు  లేదా గోడౌన్ల నుంచి కొత్తగా సరుకులు రావాలి. అది జరగాలంటే ముందు అక్కడికి సరుకును తీసుకొచ్చే వాహనాలు వెళ్లాలి. అది జరగడం లేదు. ఎక్కడెక్కడి వాహనాలన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, మరి కొద్ది రోజుల్లో అన్నీ ఖాళీ అవుతాయి. మేం షాపులు తీసినా వినియోగదారులకు  సరుకులు ఇవ్వలేని పరిస్థితి. అప్పుడు లాక్‌డౌన్‌ నుంచి మాకు మినహాయింపు ఇచ్చినా మేం ఎవ్వరికీ సహాయం చేయలేని దుస్థితి వస్తుంది. దీనికి ఒక్కటే పరిష్కారం. సరుకు వాహనాలను పూర్తిగా అనుమతించాలి. స్టాక్‌పాయింట్లు, పంపిణీ కేంద్రాలు పూర్తిగా పనిచేసేలా వెసులుబాటు కల్పించాలి. అప్పుడే షాపులకు సరుకులు చేరుతాయి’’ అని ఆంధ్రప్రదేశ్‌ వర్తక సంఘానికి చెందిన ప్రతినిధి ఒకరు  చెప్పారు.


జేసీలు ఏం చేస్తున్నట్లు?

నిత్యావసరాల పంపిణీ, రవాణా, పర్యవేక్షణ బాధ్యత ను పౌరసరఫరాల శాఖతోపాటు, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్లదే ఆ బాధ్యత. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సరుకుల రవాణా వాహనాలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకోకుండా, అవి గమ్యస్థానానికి చేరేలా వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. దీనిపై పోలీసులకు ప్రత్యేకమైన మార్గదర్శకా లు ఇవ్వాలి. ముఖ్యంగా సప్లై చైన్‌ ఎలా ఉంది? ఎక్కడ కొరత ఉంది? అన్నది సమీక్షించాలి. ఈ పనిచేయాల్సిన జేసీలు కూడా కరోనా విపత్తు చర్యల్లో పాల్గొంటున్నారు. ‘‘ఇప్పటిదాకా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సప్లైచైన్‌ నిలిచిపోకుండా ఏ ఒక్క చర్య తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే పరిస్దితి కొనసాగితే మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. సరుకులు బ్లాక్‌మార్కెట్‌ కాకుండా చూడటం ఎంత ముఖ్యమో...అవి రోడ్లమీద నిలిచిపోకుండా అడ్డుకోవడం అంతే ముఖ్యం. ’’ అని గతంలో పౌరసరఫరాల శాఖ వ్యవహారాల పర్యవేక్షించిన ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అభిప్రాయపడ్డారు.


తెచ్చిన సరుకు ఏది?

జనతా కర్ఫ్యూ రోజు రాత్రే సూపర్‌మార్కెట్లు, కిరాణా, పచారీ షాపులు సగానికి సగం ఖాళీ అయ్యాయి. కార్పొరేట్‌ కంపెనీలు నిర్వహించే ఫ్రెష్‌లు, స్టోర్‌ల పరిస్థితీ ఇలాగే ఉంది. లాక్‌డౌన్‌ ఎన్ని రోజులు ఉంటుందోనన్న భయంతో ప్రజలు షాపుల్లో ఉన్న సరుకులను అవసరానికి మించి కొనుగోలు చేసి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు కార్పొరేట్‌ ఫ్రెష్‌ల నుంచి చిన్నస్థాయి పచారీ కొట్టుల మేర సరుకులు నిండుకున్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌ తర్వాత వాహనాలను ఆపేస్తున్నారు. నిత్యావసరాలకు మినహాయింపు ఉందని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెప్పినా, అనేక ఆదేశాలు ఇచ్చినా.... ఆచరణలో అది అమలు కావడం లేదని తాజా  పరిస్థితి  నిరూపిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement