నెర్రెలు బారి.. నీళ్లు కారి!

ABN , First Publish Date - 2021-07-28T09:00:12+05:30 IST

ఇళ్లు, పొలాలే కాదు... తమ ఊరినే వదులుకొని పునరావాస కాలనీకి చేరుకున్న మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. నాలుగు రోజుల క్రితం చిన్నపాటి వర్షం కురిసిందో.. లేదో.. వారు ఉంటున్న ఇళ్ల

నెర్రెలు బారి..  నీళ్లు కారి!

శ్లాబ్‌ల నుంచి ఊడిపడుతున్న పెచ్చులు

చిన్న వర్షానికే కొన్ని చోట్ల కుంగిన ఫ్లోరింగ్‌

పునరావాస కాలనీలో ప్రమాదకరంగా ‘డబుల్‌’ ఇళ్లు

భయం గుప్పిట ‘మల్లన్న సాగర్‌’ నిర్వాసితులు

గోడలకు టార్పాలిన్‌ కవర్లు కట్టి కాలం వెళ్లదీత

గుట్టుగా మరమ్మతులు చేపడుతున్న కాంట్రాక్టర్లు


గజ్వేల్‌, జూలై 27: ఇళ్లు, పొలాలే కాదు... తమ ఊరినే వదులుకొని పునరావాస కాలనీకి చేరుకున్న మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. నాలుగు రోజుల క్రితం చిన్నపాటి వర్షం కురిసిందో.. లేదో.. వారు ఉంటున్న ఇళ్ల గోడలు నెర్రెలు బారడమే కాదు.. శ్లాబ్‌ల నుంచి నీళ్లు కారుతున్నాయి. దీంతో, ‘ఇదేం గోసరా దేవుడా..’ అంటూ వారు తలలు పట్టుకుంటున్నారు. ఇళ్లు ఎక్కడ కూలుతాయోనన్న భయంతో ప్రాణాలు అరచేత పట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 600 ఎకరాల్లో 2,400 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి, మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు ఇటీవలే అప్పగించారు. మూడు నెలల క్రితం ఆయా గ్రామాల ప్రజలు వీటిలో చేరారు. అయితే, ఇటీవల వర్షాకాలం ప్రారంభం కావడంతో పునరావాస కాలనీలోని సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాంట్రాక్టర్లు హడావుడిగా పనులు చేయడంతో మెజారిటీ ఇళ్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.




ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం

వర్షం కురిసినప్పటి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. మా ఇంట్లో పిల్లలను బియ్యం సంచులపై కూర్చోబెట్టి ఇంట్లో కారుతున్న నీటిని వంట పాత్రలతో బయటకు ఎత్తిపోశాం. మా ఊర్లోకెంచి తెచ్చి ఈడ పడేసిన్రు. కనీసం పట్టించుకున్నోళ్లు లేరు. 

 వేముల బాలవ్వ, వేములఘాట్‌ 


బతుకుతమో, చస్తమో తెలుస్తలేదు

మేం బతుకుతమో, సస్తమో తెలుస్తలేదు. ఇళ్లలో ఉండాలంటే భయంగా ఉంది. భాష రానోళ్లు వస్తున్నరు. వాళ్లు చెప్పేది మాకు అర్ధమైతలేదు. పోరగాండ్లకు భవిష్యత్‌ లేకుండా పోయింది. ఉన్న ఇళ్లు, జాగలు తీసుకుని ఈడికి తెచ్చి పడేసిన్రు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. 

 ఎక్కలదేవి లక్ష్మి


ఇటీవల కురిసిన వర్షాలకు పలు ఇళ్ల స్లాబ్‌ల నుంచి నీళ్లు కారుతున్నాయి. దీంతో గదుల్లో గిన్నెలు పెట్టి నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొన్ని ఇళ్లలో స్లాబ్‌ల పెచ్చులూడాయి. కొన్ని చోట్ల గోడలు నెర్రెలు బారాయి.  ఫలితంగా ఇళ్లకు టార్ఫాలిన్‌ కవర్లను కప్పి జాగ్రత్తలు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇళ్ల ముందు మెట్ల భాగంలో కట్టిన గోడలు కూలిపోవడం, వరండాల్లో ఫ్లోరింగ్‌ కుంగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక చోట రోడ్డు సైతం కుంగిపోవడంతో మరోవైపు నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. తమ గ్రామాల్లో ఇళ్లను ఖాళీ చేయకముందు అన్నీ తామై చూసుకున్న అధికారులు.. ఇప్పుడు పునరావాస కాలనీలో సమస్యలు ఉత్పన్నమవుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తీవ్ర విమర్శలు రావడంతో అప్రమత్తమైన అధికారులు, కాంట్రాక్టర్లు గుట్టుగా మరమ్మతులు చేయిస్తున్నారు. ఇళ్లలో ఫ్లోరింగ్‌ తీసేసి, నూతనంగా వేయిస్తున్నారు. నెర్రెలు బారిన గోడలను తీసివేయించి నూతనంగా నిర్మిస్తున్నారు. వరండాలు, గోడలు కుంగిన చోట మళ్లీ పనులు చేపట్టారు. 

Updated Date - 2021-07-28T09:00:12+05:30 IST