ఆహా.. వాసం!

ABN , First Publish Date - 2021-04-10T07:56:24+05:30 IST

ఆకాశంలోని చుక్కలు కొన్ని నేలకు దిగొచ్చి వరుస కట్టాయా అన్నట్లుగా అక్కడ చక్కని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు. మంచి నీటికి కొరత లేకుండా పెద్ద పెద్ద నీళ్ల ట్యాంకులు..

ఆహా.. వాసం!

  • అన్ని వసతులతో మల్లన్నసాగర్‌ పునరావాస కాలనీ 
  • 600 ఎకరాల్లో 2,400 డబుల్‌ ఇళ్లు, 3600 ప్లాట్లు 
  • ఇంటింటికీ భగీరథ నీళ్లు, విద్యుత్తు కనెక్షన్‌ 
  • ఫంక్షన్‌ హాళ్లు, రోడ్లు, బడులు, ప్రార్థనా స్థలాలు, కాంప్లెక్స్‌లు
  • నెల రోజుల్లో కాలనీ నిర్మాణం పూర్తికి కసరత్తు

గజ్వేల్‌, ఏప్రిల్‌ 9: ఆకాశంలోని చుక్కలు కొన్ని నేలకు దిగొచ్చి వరుస కట్టాయా అన్నట్లుగా అక్కడ చక్కని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు. మంచి నీటికి కొరత లేకుండా పెద్ద పెద్ద నీళ్ల ట్యాంకులు.. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్‌, విద్యుత్తు కనెక్షన్‌, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నివాస సముదాయాల మధ్య విశాలమైన రోడ్లు, మధ్యలో డివైడర్లు, వాటిపై రాత్రుల్లో వెలుగులను చిమ్మే బటర్‌ ఫ్లై లైట్లు. ఇవన్నీ మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితుల కోసం సిద్ధమవుతున్న పునరావాస కాలనీ హంగులు. అంతేనా.. ఇది లేదు అన్న ప్రశ్నే తలెత్తకుండా గేటెడ్‌ కమ్యూనిటీ వాసులనే విస్మయపరిచేలా మరెన్నో సౌకరాలు అందుబాటులోకి రానున్నాయి. చిన్న చిన్న మార్కెట్లు, కమర్షియల్‌ కాంప్లెక్సులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, ఫంక్షన్‌ హాళ్లను నిర్మించనున్నారు. పునరావాస కాలనీ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. ముంపు గ్రామాలను ఖాళీ చేసిన నిర్వాసితుల్లో 80శాతం ఇప్పటికే కాలనీల్లోకి వచ్చేసి తమ ఇళ్లలోకి చేరిపోయారు. నెల రోజుల్లో ఈ కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో మిగతా పనులు జోరుగా సాగుతున్నాయి. 


2019 మార్చి-ఏప్రిల్‌లో మొదలైన కాలనీ నిర్మాణం పనులు అనుకున్నట్లుగా పూర్తయితే దేశంలోనే అన్ని వసతులు, ఆధునాతన సౌకర్యాలతో అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మొట్టమొదటి పునరావాస కాలనీ ఇదే కానుంది...ఉన్న ఇల్లు, కన్నతల్లిలాంటి ఊరు ఇక మనది కాదని.. శాశ్వతంగా వదిలేసి వెళ్లాలని తెలిసినప్పుడు ఆ బాధ మాటలకు అందదు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ముంపు గ్రామాల ప్రజలూ ఇలానే బాధపడ్డారు. ఇప్పుడు వారిలో ఆ అసంతృప్తి ఛాయలు మాయమవుతూ పూర్తి సౌకర్యవంతమైన జీవితానికి భరోసా కలిగించేవిధంగా ఆశలు చిగురిస్తున్నాయి. ఆ దిశగా వారిలో కొండత విశ్వాసాన్ని కల్పిస్తోంది అన్ని వసతులతో కూడిన మల్లన్నసాగర్‌ పునరావాస కాలనీయే! మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌, లక్ష్మాపూర్‌, బ్రాహ్మణబంజేరుపల్లి, పల్లేపహాడ్‌, వేములఘాట్‌, కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం గ్రామాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. నిర్వాసితులైన ఈ ఏడు గ్రామాలకు చెందిన ప్రజల కోసం గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో పునరావాస కాలనీని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకుగాను ముట్రాజ్‌పల్లి గ్రామ పరిధిలోని 326, 331  సర్వేనంబర్లు.. సంగాపూర్‌లోని 68, 55, 80  సర్వే నంబర్లు... గజ్వేల్‌ రెవెన్యూ పరిధిలోని 560 సర్వే నంబర్లలో 600 ఎకరాల భూమిని సేకరించింది.  


నిండుగా సాయం! 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు మల్లన్నసాగర్‌ నిర్వాసితులను ఆదుకునేందుకు కార్యాచరణ సిద్ధమైంది. నిర్వాసితులు భార్యాభర్తలైతే వారికి 250 చదరపు గజాల స్థలం కేటాయించి, అక్కడ రూ.5.04 లక్షలతో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు వారికి ఉపాధి కోసం రూ.7.5 లక్షల నగదు ఇస్తారు.   ఇల్లు వద్దనుకునే వారికి నిర్మాణానికి అయ్యే రూ.5.04 లక్షలను చేతికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక 25 ఏళ్లు నిండి పెళ్లికాని యువకులకు 250 చదరపు గజాల స్థలాన్ని, రూ.5 లక్షల నగదును ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏడు గ్రామాల్లోని నిర్వాసితుల కోసం 2,400 ఇళ్లను నిర్మించారు. మరో 3600 ప్లాట్లను ఏర్పాటు చేశారు. పల్లెపహాడ్‌, వేములఘాట్‌లకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలు పూర్తవగా, మిగతా గ్రామాలకు చెందిన నిర్వాసితుల ఇళ్ల పనులు ఉధృతంగా సాగుతున్నాయి.  పల్లెపహాడ్‌, వేములఘాట్‌లకు చెందిన మెజారిటీ కుటుంబాలు ఇప్పటికే కాలనీకి వచ్చేశాయి. వారిని అధికారులే దగ్గరుండి ప్రత్యేక వాహనాల్లో పునరావాస కాలనీకి తెచ్చారు. 


3 బడులు.. 6 అంగన్‌వాడీలు

కాలనీలో రోడ్లను 80, 60, 40, 30 చదరపు అడుగులతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80, 60, 40 ఫీట్ల రోడ్లలో తారు రోడ్డును, 30 ఫీట్ల రోడ్లలో సిమెంట్‌ రోడ్లను పూర్తి చేశారు. 80, 60 ఫీట్ల రోడ్లలో మధ్యలో డివైడర్‌లను ఏర్పాటు చేసి, బటర్‌ఫ్లై లైటింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. పిల్లల చదువుల కోసం మూడు ప్రాథమికొన్నత పాఠశాలలు, ఆరు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నారు. వివాహాది శుభకార్యాల కోసం రెండు ఫంక్షన్‌హాళ్లు సిద్ధమవుతున్నాయి. మంచినీటి వసతి కోసం నాలుగు వాటర్‌ ట్యాంకులను నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మికానందం కోసం గుడి, చర్చి, మసీదు నిర్మాణాలకు స్థలాలను సిద్ధం చేశారు. మున్ముందు కమర్షియల్‌ కాంప్లెక్సులు, చిన్న, చిన్న మార్కెట్‌లను ఏర్పాటు చేయనున్నారు. పునరావాస కాలనీ నిర్మాణ పనులను సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  

Updated Date - 2021-04-10T07:56:24+05:30 IST