మరీ ఇంత దారుణమా.. రావత్‌కు నివాళి అర్పించేందుకు కూడా మమ్మల్ని అనుమతించరా?: మల్లికార్జున ఖర్గే ఫైర్

ABN , First Publish Date - 2021-12-09T23:38:46+05:30 IST

రాజ్యసభ చైర్ పర్సన్ వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే

మరీ ఇంత దారుణమా.. రావత్‌కు నివాళి అర్పించేందుకు కూడా మమ్మల్ని అనుమతించరా?: మల్లికార్జున ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్ పర్సన్ వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత,  రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా ఇతరులకు నివాళు అర్పించేందుకు ప్రతిపక్ష ఎంపీలను వెంకయ్య అనుమతించలేదని ఆరోపించారు.


రాజ్యసభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన తర్వాత బిపిన్ రావత్, ఇతరులకు నివాళులర్పించేందుకు ఒక్కో ఎంపీకి ఒకటి, రెండు నిమిషాల సమయం కావాలని డిమాండ్ చేసినట్టు ఖర్గే తెలిపారు. తమ డిమాండుకు ఆయన అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని మండిపడ్డారు.


రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ మాత్రం మరోలా స్పందించారు. సభ మొత్తం ఏకమొత్తంగా విచారం వ్యక్తం చేసి సంతాపం తెలిపిందని పేర్కొన్నారు. కాబట్టే వ్యక్తిగత సంతాపానికి అనుమతించలేదని స్పష్టం చేశారు. మరోవైపు, టీఎంసీ కూడా దీనిపై స్పందించింది. ఇది చాలా దారుణమైన విషయమని, జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులర్పించేందుకు ప్రతిపక్ష సభ్యులను అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఇదే విషయమై టీఎంసీ రాజ్యసభ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

Updated Date - 2021-12-09T23:38:46+05:30 IST