Abn logo
Jun 24 2021 @ 03:08AM

బ్యాంకులకు రూ.9,371 కోట్ల ఆస్తులు అప్పగించాం..

మాల్యా, నీరవ్‌, చోక్సీల మొత్తం బకాయిల్లో 40 శాతం రికవరీ  ఈడీ వెల్లడి 

మాల్యాకు చెందిన రూ.5,800 కోట్ల షేర్ల విక్రయం 


న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): వ్యాపారాల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)కు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన ఘరానా పెద్దల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వ బ్యాంకులను మోసం చేసిన విజ య్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలకు చెందిన రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది. వీరి నుంచి రావాల్సిన రూ. 22,586 కోట్ల బకాయిల్లో ఇవి 80 శాతానికి సమానమని తెలిపింది. ఇందులో ఇప్పటికే రూ.9,371 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులకు బదిలీ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ ముగ్గురు ఘరానా పెద్ద లు పీఎ్‌సబీలకు చెల్లించాల్సిన బకాయిల్లో వీటి విలువ 40 శాతం ఉంటుందని తెలిపింది.


మరోవైపు విజయ్‌ మాల్యాకు యునైటెడ్‌ బ్రూవరీస్‌, మెక్‌డోవెల్‌ హోల్డింగ్స్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ కంపెనీల్లో ఉన్న రూ.5,800 కోట్ల విలువైన షేర్లను బుధవారం నాడు బెంగళూరులోని డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ విక్రయించిందని ఈడీ పేర్కొంది. కాగా ఈ నెల 25న మరోసారి రూ.800 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నట్లు తెలిపింది. బ్యాం కులను మోసం చేసిన కేసుల్లో మాల్యాకు చెందిన ఈ షేర్లను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే.   


రప్పించే ప్రయత్నాలు:

వ్యాపారాల పేరుతో వీరు పీఎ్‌సబీల నుంచి రూ.22,586 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. తర్వాత దేశ, విదేశాల్లో అనేక డొల్ల కంపెనీలు స్థాపించి నిధులను విదేశాలకు తరలించారు. ఈ గుటుమట్లనూ ఛేదించినట్టు ఈడీ వెల్లడించింది. విదేశాల్లో తలదాచుకున్న వీరిని దేశానికి రప్పించే ప్రయత్నాలూ త్వరలో ఒక కొలిక్కి రానున్నాయి. తనను భారత్‌కు అప్పగించవద్దని విజయ్‌ మాల్యా పెట్టుకున్న పిటిషన్‌ను బ్రిటన్‌ సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. కాగా తనను భారత్‌కు అప్పగించరాదంటూ యూకే హైకోర్టులో నీరవ్‌ మోదీ పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.  


వదలంగాక వదలం

పీఎస్‌బీ లను నిండా ముంచిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వంటి ఘరానా మోసగాళ్లను వదిలే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ట్వీట్‌ చేశారు. ‘ఆర్థిక నేరస్థులు, పరారీలో ఉన్న ఘరానా పెద్దలను వదలం. వారి ఆస్తులను జప్తు చేసి మరీ బకాయిలు వసూలు చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు.