HMDA పై మాల్‌వేర్‌ దాడి.. ఇప్పటికే మూడు సార్లు Hacking.. అసలేం జరిగింది.. ఎన్ని అనుమానాలో..!?

ABN , First Publish Date - 2021-10-08T15:42:29+05:30 IST

డేటాను టార్గెట్‌ చేస్తూ సైబర్‌ నేరగాళ్లు ఈ దాడికి పాల్పడినట్లు

HMDA పై మాల్‌వేర్‌ దాడి.. ఇప్పటికే మూడు సార్లు Hacking.. అసలేం జరిగింది.. ఎన్ని అనుమానాలో..!?

హైదరాబాద్‌ సిటీ : సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ ద్వారా హెచ్‌ఎండీఏ సర్వర్‌పై దాడి చేసి కీలకమైన డేటాను మాయం చేసినట్లు సమాచారం. సర్వర్‌ను హ్యాక్‌ చేయడం వల్లే ఇటీవల వారం రోజుల పాటు వెబ్‌సైట్‌ షట్‌డౌన్‌ కావడంతో పాటు కొంత డేటా చోరీ అయినట్లు తెలిసింది. ప్రణాళిక విభాగంలోని నిర్మాణ అనుమతుల దరఖాస్తులకు సంబంధించిన డేటాను టార్గెట్‌ చేస్తూ సైబర్‌ నేరగాళ్లు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే హైదరాబాద్‌ మహా నగరంతో పాటు చుట్టూరా ఏడు జిల్లాల పరిధి మేర రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ప్లాన్‌ - 2031ను దెబ్బ తీస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెబ్‌సైట్‌, సర్వర్‌ ఇప్పటికే మూడు సార్లు హ్యాక్‌ అయినా ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


డేటా మాయంపై..

వెబ్‌సైట్‌లో 2021కి సంబంధించిన డేటా మొత్తం మాయం కావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బహుళ అంతస్తుల భవన నిర్మాణ, లేఅవుట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీల అనుమతులకు సంబంధించి పొరపాట్లను కనుమరుగు చేయడానికి డేటాను మిస్‌ చేశారా..? అనే అనుమానాలున్నాయి. గతంలో హెచ్‌ఎండీఏలో ఓ జోన్‌లో భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల ఫైల్స్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వెబ్‌సైట్‌, సర్వర్‌పై దాడికి మాల్‌వేర్‌ను ఎంచుకున్నారేమోనని అనుమానిస్తున్నారు. వెబ్‌సైట్‌, సర్వర్‌పై మాల్‌వేర్‌ దాడి జరిగిందని అధికారులు ధ్రువీకరిస్తున్నా ఇప్పటి వరకు సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేయలేదని సమాచారం. హెచ్‌ఎండీఏ పరిధిలో మెరుగైన పట్టణ అభివృద్ధి కోసం ఐదు మాస్టర్‌ప్లాన్‌లను ఇంటిగ్రేటెడ్‌ చేశారు. ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ప్లాన్‌-2031ని తీసుకొచ్చారు. హ్యాకింగ్‌ వల్ల ఈ ప్లాన్‌కు ఏమైనా ముప్పు కలిగిం దా అనేది పరిశీలించాలని ఓ రిటైర్డ్‌ ప్లానింగ్‌ అధికారి సూచిస్తున్నారు.


ఏం జరిగింది..?

హెచ్‌ఎండీఏలోని పట్టణ ప్రణాళిక విభాగంలో ఓ ప్లానింగ్‌ అధికారి వద్ద ఉండే కంప్యూటర్‌ ఆపరేటర్‌కు గత నెలలో ఓ మెయిల్‌ వచ్చినట్లు సమాచారం. ఆ మెయిల్‌ను క్లిక్‌ చేయగానే కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టం అతని ఆధీనంలో లేకుండా పోయింది. ఏదైనా సాంకేతిక సమస్య వస్తే టెక్నికల్‌ సిబ్బంది సిస్టమ్‌ వద్దకు రాకుండా ఒక్కోసారి సరి చేస్తుంటారు. అదే తరహాలో ఆపరేట్‌ చేస్తున్నారేమోనని ఆపరేటర్‌ భావించారు. కానీ, డీపీఎంఎస్‌ మొత్తం సైబర్‌నేరగాళ్ల చేతిలోకి వెళ్లడంతో పాటు ఆ కంప్యూటర్‌కు ఇంటర్‌ లింకులుగా ఉన్న కంప్యూటర్లలోని డేటాపై, సర్వర్‌పై కూడా దాడి చేసినట్లు తెలిసింది. గతంలో కూడా వెబ్‌సైట్‌ మూడు సార్లు ఇలా హ్యాక్‌ చేశారు.

Updated Date - 2021-10-08T15:42:29+05:30 IST