Abn logo
Oct 26 2021 @ 16:15PM

గోవాలో మమత హోర్డింగ్‌లు ధ్వంసం..బీజేపీ పనేనన్న టీఎంసీ

పనజి: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోస్టర్లు, హోర్డింగ్‌లను గోవాలో పలు చోట్ల అగంతకులు ధ్వంసం చేశారు. మమత ముఖం కనిపిస్తున్న చోట్ల నలుపురంగు పులిమారు. ఈ దుశ్చర్యను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇది బీజేపీ పనేనంటూ గోవా టీఎంసీ విభాగం ఆరోపణలు గుప్పించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో ఈనెల 28న మమతా బెనర్జీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

కాగా, బీజేపీ అత్యంత గోప్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేసిందని, గోవా వ్యాప్తంగా మమత హోర్డింగ్‌లు ఎక్కడున్నా రాత్రికి రాత్రి వాటి రూపు మార్చాలని, నేలమట్టం చేయాలని నిర్ణయించిందని టీఎంసీ గోవా యూనిట్ మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆరోపించింది. ఈ విధ్వంస చర్య మహిళాలోకానికే అవమానమని, దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి అయిన మమతను అవమానించడం గర్హనీయమని ఆ ప్రకటన పేర్కొంది. ప్రతీకారేచ్ఛతో ఉన్న ప్రభుత్వానికి గోవా ప్రజలు తగిన గుణపాఠం చెప్పితీరుతారని, వారు కూల్చింది గోవా టీఎంసీ బ్రాండింగ్‌‌ను కాదని, గోవా ప్రజల గౌరవానికి మచ్చతెచ్చారని విమర్శించింది. బీజేపీ చర్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండటమే కాకుండా నిర్భయంగా వ్యాపారాలు చేసుకునే స్థానికుల జీవనాధారంపైన కూడా పడుతుందని తెలిపింది.

ఇవి కూడా చదవండిImage Caption