కేంద్ర దళాలను దుర్వినియోగం చేస్తున్నారు : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2021-04-06T20:23:47+05:30 IST

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ జరుగుతుండగా

కేంద్ర దళాలను దుర్వినియోగం చేస్తున్నారు : మమత బెనర్జీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ జరుగుతుండగా, ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర బలగాలను నిరాఘాటంగా బరితెగించి దుర్వినియోగపరుస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ఆమె ట్విటర్ వేదికగా బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 


‘‘కేంద్ర బలగాల బహిరంగ దుర్వినియోగం అప్రతిహతంగా కొనసాగుతోంది. మేము పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నప్పటికీ, చాలా ప్రాంతాల్లో యూనిఫాంలోని వ్యక్తులు ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా చాలా మందిని ప్రభావితం చేస్తుండగా, టీఎంసీ ఓటర్లను బహిరంగంగా బెదిరిస్తుండగా, ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిగా కొనసాగుతోంది’’ అని మమత బెనర్జీ ఆరోపించారు. ఈ ట్వీట్‌తోపాటు ఆమె ఓ వీడియో క్లిప్‌ను కూడా జత చేశారు. ఈ ట్వీట్‌లో ఆమె పరోక్షంగా బీజేపీని ప్రస్తావించారు. 


మమత బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణలో అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆమె ఆరోపించారు. ఆమె ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్ ఏప్రిల్ 1న జరిగిన సంగతి తెలిసిందే. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించవలసిన అవసరం ఏమిటని మమత బెనర్జీ గతంలో ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-04-06T20:23:47+05:30 IST