ఈసీ నోటీసులకు సమాధానమిచ్చిన మమతాబెనర్జీ

ABN , First Publish Date - 2021-04-10T22:39:16+05:30 IST

కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్)పై చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల కమిషన్..

ఈసీ నోటీసులకు సమాధానమిచ్చిన మమతాబెనర్జీ

కోల్‌కతా: కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్)పై చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ శనివారంనాడు సమాధానమిచ్చారు. తాను ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని ఈసీకి తెలియజేశారు. ఈసీకి రాసిన లేఖలో ఆమె ఈ వివరణ ఇచ్చారు. సీఏపీఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటర్లను రెచ్చగొట్టడం కానీ, ప్రభావితం చేయడానికి కానీ తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.


మార్చి 28, ఏప్రిల్ 7వ తేదీల్లో కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలపై ఆమె వైఖరి స్పష్టం చేయాలని మమతా బెనర్జీకి శుక్రవారంనాడు ఈసీ నోటీసు ఇచ్చింది. ఆమెకు ఈసీ నోటీసు ఇవ్వడం ఇది రెండోసారి. గత బుధవారంనాడు కూడా ఆమెకు ఈసీ నోటీసు ఇచ్చింది. ఏప్రిల్ 3న చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఓట్లు చీలిపోకుండా ముస్లిం ఓటర్లు కలిసికట్టుగా ఉండాలని మమత చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ అడిగింది. నోటీసు అందిన 48 గంటల్లోగా సమాధానం ఇవ్వకుంటే, మరోసారి గుర్తు చేయనవసరం లేకుండానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది.

Updated Date - 2021-04-10T22:39:16+05:30 IST