ఈసీ పది నోటీసులు ఇచ్చినా నా వైఖరి అదే: మమత

ABN , First Publish Date - 2021-04-09T02:16:43+05:30 IST

మతాల ఆధారంగా ఓటర్లను విభజించడంపై తాను గళమెత్తుతూనే ఉంటానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

ఈసీ పది నోటీసులు ఇచ్చినా నా వైఖరి అదే: మమత

కోల్‌కతా: మతాల ఆధారంగా ఓటర్లను విభజించడంపై తాను గళమెత్తుతూనే ఉంటానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తనకు 10 షోకాజ్ నోటీసులు ఇచ్చినా సరే తన వైఖరి మారబోదని స్పష్టం చేశారు. టీఎంసీకి ఓటు వేసి అండగా నిలవాలంటూ ముస్లిం సమాజాన్ని మమత కోరారని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమంటూ ఎన్నికల సంఘం నిన్న (బుధవారం) మమతకు నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మమత తాజాగా  పై విధంగా స్పందించారు.


దోమ్జూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఎంసీ చీఫ్ మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం ఓటు బ్యాంకు అంటూ ప్రధాని మోదీ పదేపదే తన ప్రసంగాల్లో చెబుతుంటారని, మరి ఆయనపై ఎందుకు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ‘‘మీరు (ఈసీ) నాకు 10 షోకాజ్ నోటీసులైనా ఇచ్చుకోవచ్చు. కానీ నా స్పందనలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. హిందూ, ముస్లింలుగా ఓటర్లను విభజించడానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూనే ఉంటాను. నేనెప్పుడూ ఇదే వైఖరికి కట్టుబడి ఉంటాను’’ అని మమత తేల్చి చెప్పారు.

Updated Date - 2021-04-09T02:16:43+05:30 IST