Advertisement
Advertisement
Abn logo
Advertisement

మమత వ్యూహాలు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్న రెండుమాటలమీద ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం తేలికేననడం, యూపీఏ అనగానేమి అని ఎగతాళిగా ఓ ప్రశ్నవేసి, అది ఇప్పుడు లేదని తేల్చేయడం ద్వారా మమత నలుగురి దృష్టీ ఆకర్షించారు. ఢిల్లీ గద్దెమీద ఎప్పటినుంచో మమత కన్ను ఉన్నదని అందరికీ తెలిసిందే. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతను ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులూ ధారపోసింది ఆమె హస్తిన దండయాత్రను నిలువరించేందుకేనని టీఎంసీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. బీజేపీని బలంగా ఢీకొట్టి, బెంగాల్ లో హ్యాట్రిక్ సాధించిన తరువాత మమతను పట్టుకోవడం ఇక ఎలాగూ కష్టమే. 


కాంగ్రెస్ పని అయిపోయిందనీ, ఇక తానే దేశానికి దిక్కని మమత పరోక్షంగా గుర్తుచేస్తున్నారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్‌తో భేటీ అయిన తరువాత, రాహుల్ గాంధీ మీద ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు గతంలో ఆమె రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ నోటినుంచి విన్నవే. రాహుల్ కు రాజకీయం అర్థంకావడం లేదనీ, రోడ్లమీదకు వచ్చి ఉద్యమాలు చేయపోతే మోదీ తనకుతానుగా ఓడిపోరని పీకే కూడా బెంగాల్ ఎన్నికల హోరు మధ్య వాపోయారు. కాంగ్రెస్ (రాహుల్) నాయకత్వంలో మోదీని గద్దెదింపడం జరగనిపని కనుక ప్రాంతీయపార్టీలన్నీ తనచుట్టూ చేరాలన్నది మమత సందేశం కాబోలు. బెంగాల్ కు భౌగోళికంగా దగ్గరలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఆమె విస్తరణ విన్యాసాలు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎక్కడైనా ఆమె కాంగ్రెస్ నూ, బీజేపీయేతర చిన్నాచితకా పార్టీలనే దెబ్బతీయగలరు. గోవాలో మాజీ ముఖ్యమంత్రులను చేర్చుకుంటూ, వివిధ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులకు పార్టీ కండువాలు కప్పుతూ ఎన్నికలకుముందు హడావుడి చేయడం మమతకు కొత్తేమీకాదు. ప్రధానంగా, రాహుల్ మీద కక్షపూనినందున కాంగ్రెస్‌ను ఘోరంగా దెబ్బతీయడం ఆరంభించారని అంటారు. 


ఇలా ఢిల్లీ వెళ్ళి, అలా మోదీని దించేయబోతున్నట్టుగా ఉంటాయి మమత మాటలు. రణనినాదాలే కాక, చర్యలూ చేష్టల్లో కూడా ఆమె వేగం ఊహకు అందనిది. వివిధ రాష్ట్రాల్లో ఎవరెవరో వచ్చిచేరుతూంటే అతిత్వరలోనే దేశస్థాయిలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని తృణమూల్ ఆక్రమించబోతున్నదని అనిపించడం సహజం. కానీ, కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించాలనుకోవడం పగటికలేనని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కొట్టిపారేయలేనివి. కనీసం పదిరాష్ట్రాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ ఓట్లవాటా ముప్పైశాతం వరకూ ఉంది. దేశస్థాయిలో దానిని తృణమూల్ తో పోల్చడం కూడా సరికాదు. మమతాబెనర్జీని ఒక జాతీయస్థాయి నాయకురాలిగా ప్రదర్శించడానికి ఆయా రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ వ్యూహాలు ఎంతోకొంత ఉపకరిస్తాయి. బీజేపీ వ్యతిరేకత, మోదీపై పోరాడే శక్తి వంటివి కొన్ని వర్గాలను ఆకర్షిస్తాయి. కానీ, తృణమూల్ ఆదర్శాలూ, సిద్ధాంతాలపై బెంగాల్ వెలుపల మిగతాదేశానికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అలాగే, కాంగ్రెస్ మాదిరిగా తృణమూల్ కంటూ కొంత ఓటుబ్యాంకు ఏర్పడటం కూడా ఇప్పట్లో జరగకపోవచ్చు. 


బెంగాల్ లో ఐదేళ్ళక్రితం మూడుస్థానాలున్న బీజేపీ ఇప్పుడు డెబ్బయ్ స్థానాలకు చేరుకున్నప్పటికీ మమతకు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదమైతే లేదు. వామపక్షం కూడా అక్కడ బలహీనంగానే ఉన్నది. కానీ, బెంగాల్ వెలుపల చాలా రాష్ట్రాల్లో ఇదేరకమైన రాజకీయ పరిస్థితులు లేవు. పైగా, తృణమూల్ విస్తరణ ఆమ్ఆద్మీపార్టీతో పోల్చితే స్థిరమైనదిగా, బలమైనదిగా కనిపించదు. కేవలం బీజేపీ వ్యతిరేకత, మోదీమీద ఘాటైన విమర్శలు ఓట్లు కుమ్మరించవు. ఆయా రాష్ట్రాల్లో బలమైన స్థానిక నాయకత్వాన్ని సృష్టించడం, స్థానిక సమస్యల పరిష్కారానికి ఓ ఎజెండా చూపడం, వివిధ సామాజిక శక్తుల కలయికతో కొత్తరకం రాజకీయాలు సృష్టించడం వంటివి ఓటర్లను ఆకర్షిస్తాయి. ఈ విషయంలో బెంగాల్ నుంచి ఢిల్లీకి పోవాలనుకుంటున్న మమతకంటే, దేశరాజధానినే ఏలుతున్న కేజ్రీవాల్ పార్టీ ప్రస్తుతానికి ఓ అడుగుముందున్నట్టు కనిపిస్తున్నది. మమత బలపడాలనుకుంటున్న రాష్ట్రాలకూ, కేజ్రీవాల్ క్రమేపీ విస్తరిస్తున్న రాష్ట్రాలకూ రాజకీయ ప్రాధాన్యంలోనూ, ప్రాతినిధ్యంలోనూ ఎంతో తేడా ఉన్నది.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...