Oct 19 2021 @ 16:01PM

‘ఏజెంట్’ లో మాలీవుడ్ మెగాస్టార్ ?

అక్కినేని నవసామ్రాట్ అఖిల్ హీరోగా.. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న యాక్షన్ మూవీ ‘ఏజెంట్’. సాక్షివైద్య కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘బోర్న్’ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్, వైజాగ్‌పోర్ట్, నెల్లూరు ప్రాంతాల్లో కొంతమేర చిత్రీకరణ జరుపుకుంది. ఇందులోని అఖిల్ మేకోవర్ కు, అతడి గెటప్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అఖిల్ రీసెంట్ గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతో సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో ‘ఏజెంట్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఏజెంట్ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 



‘ఏజెంట్’ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారట. ఆది అఖిల్ కు మెంటార్ లాంటి పాత్రని తెలుస్తోంది. గతంలో మమ్ముట్టి నటించిన పలు అనువాద చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే.. ‘స్వాతికిరణం, రైల్వే‌కూలి, సూర్యపుత్రులు, యాత్ర’ లాంటి డైరెక్ట్  సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడాయన. ఇప్పుడు ‘ఏజెంట్’ మూవీతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు మమ్ముట్టి. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.