మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-08-04T20:02:08+05:30 IST

రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళుతున్న అమ్మాయిలను తన వాహనంతో అనుసరించి వారిని తాకుతూ లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

గత రెండు నెలలుగా పలువురికి వేధింపులు

బీచ్‌రోడ్డులో పట్టుబడ్డ నిందితుడు


మహారాణిపేట/విశాఖపట్టణం(ఆంధ్రజ్యోతి): రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళుతున్న అమ్మాయిలను  తన వాహనంతో అనుసరించి వారిని తాకుతూ లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దిశ  ఏిసీపీ ప్రేమ్‌ కాజల్‌ వివరాలను వెల్లడించారు. కలెక్టరేట్‌ సమీపంలోని అఫీషియల్‌ కాలనీకి చెందిన దుప్పాడ రాంబాబు(30) పందిమెట్ట సమీపంలోని ఒక ప్రైవేట్‌ షిప్పింగ్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. గత రెండు నెలలుగా రాంబాబు డ్యూటీకి వెళ్లి వచ్చే సమయంలో తన ద్విచక్ర వాహనంపై హెల్మెట్‌ ధరించి బీచ్‌రోడ్డు, ఆర్‌టీసీ కాంప్లెక్స్‌, జగదాంబ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా నడిచివెళ్తున్న మహిళలు, యువతులను గుర్తించి వారిని వెంబడిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు.  జూలై 24న ఒక మహిళతో, 30న మరొక మహిళతో బీచ్‌రోడ్డులో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


దీనిపై కేసు నమోదు చేసిన మహారాణిపేట పోలీసులు కేసును దిశ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. నాలుగు ప్రత్యేక బృందాలను నియమించి బీచ్‌రోడ్డు, ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ , జగదాంబ జంక్షన్‌ , రైల్వే స్టేషన్‌ వద్ద మఫ్టీలో నిఘా పెట్టారు. ఘటనాస్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి ద్విచక్ర వాహనం గుర్తించారు.  ఈ క్రమంలో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో బీచ్‌రోడ్డులో బండి మీద వస్తున్న నిందితుడిని గుర్తించి పోలీసులు అతడిని వెంబడించారు. అదే సమయంలో నోవాటెల్‌ దగ్గరికి వచ్చేసరికి నిందితుడి వల్ల వేధింపులకు గురైన బాధితురాలు తన స్నేహితులతో కలసి ఆ వ్యక్తిని ఆపి పట్టుకున్నారు. వెంబడించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడినిఅదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీస్‌స్టేషన్‌లో విచారించగా ఒంటరి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు నేరాన్ని అంగీకరించాడు. ఈ సమావేశంలో మహారాణిపేట సీఐ సోమశేఖర్‌, టూ టౌన్‌ సీఐ వెంకటరావు  పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T20:02:08+05:30 IST