ఎన్నికల్లో ఓటు వేయలేదని.. రైతు శరీర భాగం కోసిన సర్పంచ్ మరిది

ABN , First Publish Date - 2021-12-29T08:27:02+05:30 IST

గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేయనందుకు ఒక రైతుని ఆ ఊరి సర్పంచ్ మరిది మరో ముగ్గురితో కలిసి చితకబాదాడు. ఆ తరువాత అతనికి గుర్తుండిపోయే శిక్ష విధించాలని కత్తితో అతని చెవి కోసేశాడు

ఎన్నికల్లో ఓటు వేయలేదని.. రైతు శరీర భాగం కోసిన సర్పంచ్ మరిది

గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేయనందుకు ఒక రైతుని ఆ ఊరి  సర్పంచ్ మరిది మరో ముగ్గురితో కలిసి చితకబాదాడు. ఆ తరువాత అతనికి గుర్తుండిపోయే శిక్ష విధించాలని కత్తితో అతని చెవి కోసేశాడు.  ఈ  ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. 


వివారాల్లోకి వెళితే.. బీహార్‌లోని నవాదా జిల్లా మరూయి గ్రామంలో మిథిలేశ్ యాదవ్ అనే యువకుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతను నివసించే గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో మహిళా అభ్యర్థి ముటురవా దేవి గెలుపొందింది. డిసెంబర్ 27 సోమవారం ఆమె గ్రామ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. మరుసటి రోజు ఉదయం మిథిలేశ్ పొలం నుంచి ఇంటికి వస్తుండగా.. కొత్త సర్పంచ్ మరిది జయ్‌కరణ్ యాదవ్ తన ముగ్గురు మిత్రులతో కలిసి అటువైపు వచ్చాడు. మిథిలేశ్‌ని చూసి జయ్‌కరణ్ అతనిపై దాడిచేశాడు. 


మిథిలేశ్ యాదవ్ తమ వర్గానికే చెందిన వాడై ఉండి కూడా తన వదిన ముటురవా దేవికి ఎందకు ఓటు వేయలేదని జయ్‌కరణ్‌ ప్రశ్నించాడు. తమకు ఓటు వేయకుండా మరొకరికి ఓటు వేసి ద్రోహం చేశావంటూ మిథిలేశ్‌ను అసభ్య పదజాలంతో తిట్టారు. ఆ తరువాత ద్రోహం చేసినందుకు గుర్తుండి పోయే శిక్ష విధిస్తున్నామంటూ.. మిథిలేశ్ చెవి ఒక పెద్ద కత్తి(తల్వార్)తో కోశారు. ఆ తరువాత మిథిలేశ్‌ను ఆ స్థితిలో అక్కడే పడేసి పోయారు. వారంతా వెళ్లిపోయాక మిథిలేశ్‌ అతి కష్టంమీద పోలీస్ స్టేషన్ చేరుకొని జరిగినదంతా చెప్పాడు. పోలీసులు మిథిలేశ్ ఫిర్యాదు నమోదు చేసుకొని అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 


ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే సర్పంచ్ వర్గం హింసకు పాల్పడడంతో ఆ గ్రామ ప్రజలంతా భయంభ్రాంతులకు గురయ్యారు. గ్రామ పెద్దలంతా మిథిలేశ్‌పై జరిగిన దాడి గురించి విచారణ చేయాలని పంచాయితీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. 

Updated Date - 2021-12-29T08:27:02+05:30 IST