Abn logo
Jul 28 2021 @ 17:02PM

ఆంథోనీ ఫౌచీకి బెదిరింపు మెయిల్స్..

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. అధ్యక్షుడు జో బైడెన్‌కు వైద్య సలహాదారుగా ఉన్న ఆంథోనీ ఫౌచీని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసి, జైలు‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంథోనీ ఫౌచీ, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ 56ఏళ్ల థామస్ పాట్రిక్ కొన్నల్లి జూనియర్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా మెయిల్స్ ద్వారా బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు థామస్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చారు. కాగా.. ‘ఫౌచీని రోడ్డు మీదకు లాగి, తీవ్రంగా కొట్టి, నిప్పంటించి చంపుతానంటూ’ మెయిల్‌లో థామస్‌ బెదిరింపులకు పాల్పడ్డాడని విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో న్యాయవాది పేర్కన్నారు. అంతేకాకుండా థామస్‌ను కఠినంగా శిక్షించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో నేరం రుజువైతే థామస్‌కు దాదాపు 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.