నడిరోడ్డుపై విలవిలలాడి..

ABN , First Publish Date - 2020-03-26T08:14:34+05:30 IST

కూరగాయలు తేవడానికి వెళ్లిన అతను రైతు బజార్‌ వద్ద గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. రోడ్డుపై పడి అతను గిలగిలా కొట్టుకుంటున్నా...

నడిరోడ్డుపై విలవిలలాడి..

  • కూరగాయలు తేవడానికి వెళ్లిన వ్యక్తి
  • రైతుబజారు వద్ద గుండెపోటుతో మృతి
  • కరోనా భయంతో దగ్గరకు రాని ప్రజలు


కరీంనగర్‌ క్రైం, మార్చి 25: కూరగాయలు తేవడానికి వెళ్లిన అతను రైతు బజార్‌ వద్ద గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. రోడ్డుపై పడి అతను గిలగిలా కొట్టుకుంటున్నా చుట్టూ జనం ఉన్నా ఎవరూ దగ్గరకు రాలేదు. కారణం... కరోనా వైరస్‌ భయం! సకాలంలో సాయం అందక కొద్దిసేపటికే అతను ప్రాణాలు విడిచాడు. అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి అతను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని ఒప్పుకోలేదు. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డ రైతు బజారు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది.


సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన కొప్పుల వెంకటేష్‌ (55) కొంతకాలంగా భగత్‌నగర్‌లో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. అతను మంకమ్మతోటలోని ఒక స్టీల్‌ షాపులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రైతుబజారుకు కూరగాయలు తీసుకువచ్చేందుకు బైక్‌పై వెళ్లాడు. గుండెపోటు రావడంతో రోడ్డుపై కుప్పకూలాడు. స్థానికులు ఎవరూ అతని వద్దకు వచ్చే ధైర్యం చేయలేదు. వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, మునిసిపల్‌ సిబ్బంది వచ్చి అతన్ని ఒక వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అతని పర్సులో లభించిన చిరునామా చూసి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని అతని కుటుంబ సభ్యులకు ఇంటి యజమాని చెప్పాడు. దీంతో నేరుగా మానేరు జలాశయం పక్కన ఉన్న శ్మశానవాటికకు తరలించారు. కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూప హరిశంకర్‌ ఆధ్వర్యంలో ఒక్క రూపాయి పథకం కింద వెంకటేష్‌ అంత్యక్రియలు పూర్తిచేశారు. 


Updated Date - 2020-03-26T08:14:34+05:30 IST