200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం.. చివరకు

ABN , First Publish Date - 2020-09-21T16:04:24+05:30 IST

మితిమీరిన వేగంతో ప్రయాణించడమే కాకుండా.. తాను చేసిన డేంజరస్ స్టంట్స్‌కు సంబంధించిన వీడియోను అంతర్జాలంలో పెట్టిన వ్యక్తిని షార్జా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం.. చివరకు

షార్జా: మితిమీరిన వేగంతో ప్రయాణించడమే కాకుండా.. తాను చేసిన డేంజరస్ స్టంట్స్‌కు సంబంధించిన వీడియోను అంతర్జాలంలో పెట్టిన వ్యక్తిని షార్జా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 200 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపిన సదరు వ్యక్తి... ఈ భయంకర దృశ్యాలను తానే స్వయంగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. వీడియో కాస్తా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. షార్జాలోని ఖోర్ ఫక్కన్ హైవేపై సదరు వ్యక్తి ఇలా సినిమాటిక్ స్టంట్ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. 


ఈ ఘటన నేపథ్యంలో షార్జా పోలీసులు మీడియా సమావేశం ద్వారా ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని హెచ్చరించారు. రోడ్లపై ఎక్కడికక్కడ రాడార్లు అమర్చడం జరిగిందని... ఒకవేళ పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తే రాడార్లు క్యాచ్ చేస్తాయని తెలిపారు. ఇటీవల రాడార్‌లో ఓ కారు ఏకంగా 278కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లడం రికార్డైందని  చెప్పిన పోలీసులు... ఈ ఏడాది ఇప్పటివరకు 274 మంది వాహనదారులు ఇలా 200కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించడం గుర్తించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇంజనీరింగ్ శాఖ, షార్జా పోలీస్ అధికారి మేజర్ మిషాల్ బిన్ ఖాదీం మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే 80కేఎంపీహెచ్‌ గరిష్ట వేగ పరిమితిని మించి ప్రయాణిస్తారో వారికి 3వేల దిర్హమ్(రూ.60వేలు) జరిమానా, 23 బ్లాక్ పాయింట్స్, 60 రోజుల పాటు వాహనం జప్తు చేస్తామని తెలిపారు. అలాగే 60కేఎంపీహెచ్‌ గరిష్ట వేగ పరిమితిని మించి ప్రయాణించే వారికి 2వేల దిర్హమ్(రూ.40వేలు) జరిమానా, 12 బ్లాక్ పాయింట్స్, 30 రోజుల పాటు వాహనం జప్తు చేస్తామని వెల్లడించారు. కనుక వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. 

Updated Date - 2020-09-21T16:04:24+05:30 IST