NRI: ఎన్నారైకి భారీ షాక్..! తెలిసిన వాడని నమ్మి అరకోటి చేతిలో పెడితే..

ABN , First Publish Date - 2022-08-10T03:09:07+05:30 IST

తెలిసిన వాడని నమ్మి ఓ వ్యక్తికి అరకోటి ఇచ్చిన ఎన్నారైకి భారీ షాక్ తగిలింది. తాను మోసపోయానంటూ ఆయన చివరికి పోలీసులను ఆశ్రయించారు.

NRI: ఎన్నారైకి భారీ షాక్..! తెలిసిన వాడని నమ్మి అరకోటి చేతిలో పెడితే..

ఎన్నారై డెస్క్: తెలిసిన వాడని నమ్మి ఓ వ్యక్తికి అరకోటి రూపాయలకు పైగా ఇచ్చిన ఎన్నారైకి(Nri) భారీ షాక్ తగిలింది. తాను మోసపోయానంటూ(duped) చివరికి ఆయన పోలీసులను ఆశ్రయించారు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని(America) న్యూజెర్సీకి చెందిన జగదీశ్ పటేల్‌కు 2003లో ఓ మిత్రుడి ద్వారా ముంబైకి చెందిన ఓం ప్రకాశ్‌తో పరిచయమైంది. 2008లో అమెరికాకు వెళ్లిపోయిన ఓం ప్రకాశ్ మొదట్లో జగదీశ్ ఇంట్లోనే బసచేశాడు. ఆ తరువాత అమెరికా పరిస్థితులతో సద్దుకుపోలేక ఓం ప్రకాశ్ భారత్‌కు తిరిగొచ్చేశాడు. ఆ తరువాత.. తాను పెట్టబోయే ఓ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని ఓం ప్రకాశ్ పటేల్‌ను కోరాడు. కానీ.. ప్రకాశ్ చెప్పిన బిజినెస్ ప్రాజెక్ట్ నచ్చకపోవడంతో పటేల్ పెట్టుబడి పెట్టేందుకు నిరాకరించాడు. 


ఆ తరువాత.. ఓం ప్రకాశ్ మరో వ్యాపార ప్రతిపాదనను పటేల్ ముందుంచాడు. తాను థానే ప్రాంతంలో ఓ సినిమా స్టూడియో నిర్మించబోతున్నాని చెప్పాడు. ఈ ప్రాజెక్టులో రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేయమని పటేల్‌ను కోరాడు. ఈసారి మాత్రం ఓం ప్రకాశ్ ప్రతిపాదనకు పటేల్ అంగీకరించారు. నాలుగు విడతల్లో మొత్తం రూ.51.5 లక్షలు అతడి చేతుల్లో పెట్టాడు. ఆ తరువాత.. ప్రాజెక్టు పురోగతి గురించి అడగడంతో అతడు ఫోన్లో అందుబాటులోకి రాకుండా పోయాడు. చివరికి ఓ రోజు పటేల్ థానేకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. ప్రకాశ్ చెప్పిన స్థలంలో అసలు ప్రాజెక్టే లేదని తెలుసుకుని షాకైపోయాడు. అంతేకాకుండా.. తాను పోలీసునని చెప్పుకుంటూ ఓ వ్యక్తి పటేల్‌ను బెదిరించాడు. దీంతో.. భయపడిపోయిన పటేల్ అమెరికాకు వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-08-10T03:09:07+05:30 IST