పాప పుట్టిందని వేలమందికి పానీపూరీ ఫ్రీ!

ABN , First Publish Date - 2021-09-13T16:58:25+05:30 IST

మన దేశంలో ఈనాటికీ ఆడపిల్ల, మగపిల్లాడు అనే బేధభావాలు కనిపిస్తుంటాయి.

పాప పుట్టిందని వేలమందికి పానీపూరీ ఫ్రీ!

భోపాల్: మన దేశంలో ఈనాటికీ ఆడపిల్ల, మగపిల్లాడు అనే బేధభావాలు కనిపిస్తుంటాయి. కొంతమంది వారి ఇంట ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని భావించి సంబరాలు చేసుకుంటారు. ఇదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన చిరువ్యాపారి తమ ఇంటిలో ఆడపిల్ల పుట్టిందని  ఊరంతా పండగ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు ఆ చిరువ్యాపారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 


వివరాల్లోకి వెళితే భోపాల్‌లోని కోలార్ ప్రాంతానికి చెందిన అంచల్ గుప్తా పానీపూరీ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఆనందాన్ని అందరితో కలసి పంచుకోవాని భావించిన ఆ దంపతులు భారీగా పానీపూరీలను కొనుగోలు చేసి, పెద్ద స్టాల్ ఏర్పాటుచేసి, వేలమందికి పానీపూరీ ఉచితంగా పంచిపెట్టారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అంచల్ గుప్తా గత 14 ఏళ్లుగా పానీపూరీ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. కుమార్తె పుట్టిన సందర్భంగా అంచల్ గుప్తా మాట్లాడుతూ భగవంతుడు తమ మొర ఆలకించి, తమకు ఆడపిల్లను ఇచ్చాడని అన్నారు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకునేందుకు అందరికీ ఉచితంగా పానీపూరీ పంచి పెడుతున్నామన్నారు. ప్రతీ ఆదివారం కూడా ఇదేవిధంగా పానీపూరీలు పంచుతామని తెలిపారు. 

Updated Date - 2021-09-13T16:58:25+05:30 IST