అమెజాన్‌లో ఇచ్చిన ఆర్డర్ బదులు.. బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది!

ABN , First Publish Date - 2021-06-22T14:28:26+05:30 IST

పిల్లల కోసం రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిచ్చాడా వ్యక్తి. ఆ తర్వాత తనకు వచ్చిన డెలివరీ చూసి షాకయ్యాడు.

అమెజాన్‌లో ఇచ్చిన ఆర్డర్ బదులు.. బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది!

న్యూఢిల్లీ: పిల్లల కోసం రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిచ్చాడా వ్యక్తి. ఆ తర్వాత తనకు వచ్చిన డెలివరీ చూసి షాకయ్యాడు. ఎందుకంటే దానిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి భగవాన్ నగర్ ఆశ్రమ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ బురాగోహైన్ అనే వ్యక్తికి ఎదురైందీ అనుభవం. దీన్ని అతను ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో తెగ వైరలవుతోందీ పోస్ట్. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో తాను రిమోట్ కంట్రోల్ కారు ఆర్డరిచ్చానని చెప్పిన విక్రమ్.. తనకు వచ్చిన ప్యాకేజీ చిన్నగా ఉండటంతో ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మరో పెద్ద షాక్. దాంట్లో ‘పార్లే-జీ’ బిస్కెట్ ప్యాకెట్ ఉంది.


‘అమెజాన్‌లో మనం ఆర్డరిచ్చిన దానికి బదులు పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ వస్తే.. ఇక చాయ్ పెట్టుకోవాలి’’ అంటూ విక్రమ్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘పిల్లాడే కదా తీసుకునేది.. పార్లే-జీ పంపితే సరిపోతుంది అనుకున్నారేమో?’’ అని కొందరు అంటుంటే.. ఇక వెళ్లి చాయ్ పెట్టుకో అంటూ కొందరు సలహాలిస్తున్నారు. అయితే దీనిపై అమెజాన్‌కు ఫిర్యాదు చేశానని, వాళ్లు స్పందించారని విక్రమ్ తెలిపాడు. తను చెల్లించిన సొమ్మును రిఫండ్ చేసే ప్రక్రియ మొదలైందని వెల్లడించాడు.

Updated Date - 2021-06-22T14:28:26+05:30 IST