పెళ్లి చేసుకుంటానని 26 మంది మహిళలను మోసం చేసిన ఘనుడు!

ABN , First Publish Date - 2022-01-11T01:24:37+05:30 IST

పెళ్లి పేరుతో 26 మంది మహిళలను మోసగించిన వ్యక్తికి కర్ణాటక పోలీసులు అరదండాలు వేశారు. నిందితుడు మాట్రిమోనియల్..

పెళ్లి చేసుకుంటానని 26 మంది మహిళలను మోసం చేసిన ఘనుడు!

బెంగళూరు: పెళ్లి పేరుతో 26 మంది మహిళలను మోసగించిన వ్యక్తికి కర్ణాటక పోలీసులు అరదండాలు వేశారు. నిందితుడు మాట్రిమోనియల్ సైట్లలో ప్రకటనలు ఇచ్చే యువతులకు వలవేశాడు. ఈసారి ఏకంగా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళకే గేలం వేయాలని ప్రయత్నించి  కటకటాల పాలయ్యాడు. నిందితుడిని విజయపూర్‌కు చెందిన జైభీమ్ విట్టల్ పడుకోటి (33)గా గుర్తించారు. అతడి విలాసవంతమైన కారు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. 


తండ్రి మరణం తర్వాత  హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ లిమిటెడ్ (హెస్కామ్‌)లో లైన్‌మేన్‌గా ఉద్యోగం సాధించిన విట్టల్ 2013లో కవితను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత గొడవలో ఆమెను చంపేశాడు. ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్న విట్టల్ పెళ్లి పేరుతో మహిళలను మోసగించడం మొదలుపెట్టాడు. మాట్రిమోని సైట్లలో నకిలీ ఖాతాలు తెరిచి హెస్కామ్‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్టు అందులో పేర్కొనేవాడు. 


ఆ తర్వాత మీ ప్రొఫైల్ నాకు నచ్చిందంటూ యువతులకు మెసేజ్ చేసేవాడు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు, బంధువుల నమ్మకాన్ని చూరగొనేందుకు వారిళ్లకు వెళ్లేవాడు. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి బంధువుల అమ్మాయిల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడు. తనతో పెళ్లికి అంగీకరించిన వారి బ్యాంకు ఖాతాల వివరాలను సంపాదించేవాడు. ఆ తర్వాత వారెప్పుడైనా డబ్బులు అడిగితే బెదిరించేవాడు. 


పెళ్లి పేరుతో శారీరకంగా లోబరుచుకుని ఆ తర్వాత మోసపోయిన ముగ్గురు యువతుల నుంచి పోలీసులు ఆధారాలు సేకరించారు. మొత్తంగా శివమొగ్గ, హవేరి, బెంగళూరు, మైసూరు, ధర్వాడ్, హుబ్బళ్లి, యాద్గిరి, రాయ్‌చూర్ జిల్లాలకు చెందిన మొత్తం 26 మందిని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు.


బాధిత యువతుల నుంచి మొత్తంగా రూ. 21,30 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇలాగే, పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న యువతికి వల వేయబోయి అడ్డంగా దొరికిపోయాడు. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విట్టల్ బాగోతం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-11T01:24:37+05:30 IST