Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్రెండ్‌ను చంపి ముఖం మార్చేసి తానే చనిపోయినట్టు సీన్ క్రియేట్.. మూడేళ్ల తర్వాత అసలు నిజం తెలిసి పోలీసులకే మైండ్‌బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ మైకంలో పడి ఒక వ్యక్త అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యాపిల్లల్ని అత్యంత దారుణంగా హతమార్చాడు. తనపై కేసు పడుతుందని అనుమానం రావడంతో.. ఒక స్నేహితుడిని కలిసి అతన్ని చంపేశాడు. అతని ముఖం చెక్కేసి. రైల్వే ట్రాక్‌పై పడేశాడు. ఆ శవం పక్కనే తన గుర్తింపు కార్డులు పడేశాడు. మొత్తానికి తాను కూడా చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసి తప్పించుకున్నాడు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా. మూడేళ్ల తర్వాత ఈ నిజం వెలుగులోకి రావడంతో పోలీసులు సదరు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే రాకేష్ అనే వ్యక్తి రూబీ అనే అమ్మాయిని ప్రేమించాడు. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. కానీ రాకేష్ తల్లిదండ్రులు అతనికి వేరే పెళ్లి చేశారు. రత్నేష్ కుమారి అనే అమ్మాయిని పెళ్లాడిన తర్వాత కూడా రాకేష్.. రూబీతో తన ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించాడు.


2011లో రాకేష్ పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలావుండగా 2016లో రూబీకి పోలీసు ఉద్యోగం వచ్చింది. ఆమెకు తాజ్‌మహల్ వద్ద సెక్యూరిటీ డ్యూటీ పడింది. భార్యాపిల్లలు ఉన్నప్పటికీ రాకేష్.. రూబీని కలుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే 2018లో ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. భార్యాపిల్లల్ని వదిలేస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని రూబీ తేల్చేసింది. దీంతో వాళ్లను అడ్డుతొలగించుకోవాలని రాకేష్ నిర్ణయించుకున్నాడు. అదే ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజుల భార్యాపిల్లల్ని ఇంటి బేస్‌మెంట్లోకి తీసుకెళ్లిన రాకేష్.. ఇనుప రాడ్డుతో వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత అక్కడే ఒక గొయ్యి తవ్వి వాళ్ల శవాలను పూడ్చిపెట్టేశాడు. ఆ తర్వాత మామగారు ఫోన్ చేసి కుమార్తెతో మాట్లాడాలని అడిగితే తప్పించుకోవడం ప్రారంభించాడు. దీంతో ఆందోళన చెందిన రత్నేష్ కుమారి తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతున్ని, మనుమలను ఎవరో కిడ్నాప్ చేశారని కేసు పెట్టాడు.

ఈ కేసు విచారణ కోసం రాకేష్‌ను పోలీసులు పిలిచారు. దీంతో భయపడిపోయిన రాకేష్.. కాస్‌గంజ్‌లోని రాజేంద్రను కలిశాడు. అక్కడే అతన్ని కూడా హత్యచేసి, ముఖం చెక్కేశాడు. శవాన్ని రైల్వే ట్రాక్‌పై పడేసి, దాని దగ్గర తన గుర్తింపు కార్డులు వదిలాడు. తానే చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసి, అన్నకు ఫోన్ చేసి హత్య కేసు పెట్టించాడు. అనంతరం దిలీప్ శర్మగా పేరు మార్చుకొని హరియాణాలో ఉద్యోగం కూడా చేశాడు. ఈ క్రమంలోనే ఒకరోజు తన ప్రియురాలు రూబీని కలవడానికి బయలుదేరిన దిలీప్ ఉరఫ్ రాకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాకేష్ ఇంటి బేస్‌మెంట్‌లో తవ్వి అతని భార్యాపిల్లల అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రాకేష్‌తోపాటు అతని తండ్రి బన్వారీలాల్, తల్లి ఇందుమతి, సోదరులు రాజీవ్, ప్రవేశ్, ప్రియురాలు రూబీని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement