Abn logo
Jun 10 2021 @ 17:51PM

పాలకోసం వెళ్లి బతికిపోయాడు.. భార్య సహా 9 మంది సజీవ సమాధి అయ్యారు!

ముంబై: గత రాత్రి ముంబైలోని మల్వానీ ప్రాంతంలో రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో 8 మంది చిన్నారులు సహా 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో గుండెలు పిండే విషాదం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే భవనంలో నివసిస్తున్న రఫీక్ షేక్ బిల్డింగ్ కూలడానికి కొన్ని నిమిషాల ముందు బయటకు వెళ్లాడు. ఆ వెంటనే అది కుప్పకూలింది. ఈ ఘటనలో అతడి భార్య సహా 9 మంది కుటుంబ సభ్యులు విగతజీవులయ్యారు. బయటకు వెళ్లిన అతడు మాత్రమే ప్రాణాలతో మిగిలాడు.   

45 ఏళ్ల షేక్ తన కుటుంబంతో కలిసి ఆ భవనంలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. భవనం కూలడానికి కొన్ని నిమిషాల ముందు పాల కోసం అతడు బయటకు వచ్చాడు. పాలు తీసుకుని తిరిగి అక్కడికి చేరుకున్న రఫీక్ శిథిలంగా మారిన భవనాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. అతడి భార్య, సోదరుడు, మరదలు, రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు చిన్నారులు కూలిన భవనం కింద సజీవ సమాధి అయిపోయారు. మరో కుటుంబానికి చెందిన వ్యక్తి శిథిలాల నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. 


షేక్ 16 ఏళ్ల కుమారుడు కూడా ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. మందుల కొనుగోలు కోసం వెళ్లిన అతడు కూడా ప్రాణాలతో మిగిలాడు. ఉదయం టీ కోసం పాలు కొనుగోలు చేసేందుకు వెళ్లానని, తాను తిరిగి వచ్చేసరికి భవనం కూలిపోయి ఉందని షేక్ చెప్పాడు. భవనం ఇలాంటి పరిస్థితుల్లో ఉందని తాను ఎప్పుడూ ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదం జరిగిన సమయంలో తప్పించుకునేందుకు తన కుటుంబ సభ్యులకు సమయం లేకపోయిందని చెబుతూ కన్నీరుమున్నీరయ్యాడు.   

జాతీయంమరిన్ని...

Advertisement