యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఏం చేశాడో చూడండి!

ABN , First Publish Date - 2021-06-19T19:03:44+05:30 IST

యూ ట్యూబ్‌, గూగుల్‌లో వీడియోలు చూసి...

యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఏం చేశాడో చూడండి!

  • సందీప్‌చారి.. స్నాచింగ్‌ దారి
  • వీడియోలు చూసి రిహార్సల్స్‌ 
  • వరుస దొంగతనాలు చేస్తూ అరెస్ట్‌ 
  • రూ. నాలుగు లక్షల సొత్తు స్వాధీనం

హైదరాబాద్ సిటీ/నేరేడ్‌మెట్‌ : వ్యసనాలకు బానిసై దొంగతనాల బాట పట్టాడు. యూ ట్యూబ్‌, గూగుల్‌లో వీడియోలు చూసి చైన్‌ స్నాచింగులు చేయడం నేర్చుకున్నాడు. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి జైలుకెళ్లాడు. విడుదలయ్యాక వరుస దొంగతనాలు చేస్తూ  మరోసారి పోలీసులకు చిక్కాడు. నేరేడ్‌మెట్‌లోని డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి ఈ నేరగాడి వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోతుకూర్‌ మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన కె.సందీప్‌ చారి (22) 1999లో బతుకుదెరువు కోసం నగరానికి వచ్చా డు. జవహర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిబాలాజీనగర్‌లోని శివాజీనగర్‌లో కుటుంబంతో నివాసముంటున్నాడు.


అవినాష్‌ అనే పార్టనర్‌తో కలిసి బాలాజీనగర్‌లోనే సెల్‌ ఫోన్‌ షాపును పెట్టాడు. ఆదాయం సరిపోకపోవడంతో ఆన్‌లైన్‌ ఫైనాన్స్‌ ద్వారా అప్పులు చేశాడు. డబ్బులు సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో ఈజీగా డబ్బు సం పాదించాలని నిశ్చయించుకొన్నాడు. 2021 జనవరిలో ఓ ఇంట్లో దొంగతనం చేసి జవహర్‌నగర్‌ పోలీసులుకు చిక్కి జైలు పాలయ్యాడు. జైలుకెళ్లి వచ్చినా సందీప్‌ మారలేదు. దీనికితోడు వ్యసనాలకు బానిసయ్యాడు. తిరిగి దొంగతనాలు చేయాలని నిశ్చయించుకొని, చైన్‌ స్నాచింగ్‌లకు ప్రణాళికను సిద్ధం చేశాడు. యూట్యూబ్‌, గూగుల్‌లో చైన్‌ స్నాచింగ్‌ వీడియోలను చూసి రిహార్సల్స్‌ చేశాడు. తన వాహనం యమహా ఎఫ్‌జడ్‌, సోదరుడి వాహనాలను ఉపయోగించుకుని స్నాచింగ్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు.


మధ్యలో ఉద్యోగం

2021 మార్చి నుంచి ఒంటరి మహిళలే లక్ష్యంగా ద్విచక్ర వాహనంపై వెళ్లి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఒక్క నెలలోనే మూడు చైన్‌ స్నాచింగ్‌లు చేశాడు. చైన్‌ స్నాచింగ్‌లు చేస్తూనే మూడు నెలల క్రితం ఉప్పల్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నెలకు రూ. 16 వేల జీతం వస్తున్నా అవి సరిపోక తిరిగి చైన్‌ స్నాచింగ్‌ల బాట పట్టాడు. 2021 మే నెల నుంచి జూన్‌ వరకు మరో మూడు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఈ నెల 18 యాప్రాల్‌ చౌరస్తాలో ఒంటరిగా వెళ్లే మహిళల కోసం ఎదురు చూస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అప్పటికే చైన్‌ స్నాచింగ్‌, దొంగతనాల నివారణకు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, మల్కాజిగిరి సీసీఎస్‌ పోలీసు బృందాలను, జవహర్‌నగర్‌ పోలీసు బృందాలను రంగంలోకి దించారు. 


మల్కాజిగిరి డీసీపీ కే రక్షితామూర్తి, రాచకొండ క్రైమ్‌ డీసీపీ యాదగిరి, కుషాయిగూడ అడిషనల్‌ డీసీపీ శివకుమార్‌ల అధ్వర్యంలో ఈ బృందాలు పని చేస్తున్నాయి. ఈ బృందంలోని కానిస్టేబుళ్లు శివప్రసాద్‌, శ్రీనివాస్‌ యాప్రాల్‌ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సందీ్‌పచారిని పట్టుకొని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఆరు చైన్‌ స్నాచింగ్‌లు చేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడి నుంచి 80 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు మొత్తం నాలుగు లక్షల రూపాయల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సందీప్‌చారిపై పీడీ యాక్ట్‌ పెట్టనున్నట్లు డీసీపీ చెప్పారు. స్నాచర్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు రివార్డులు అందజేసి అభినందించారు.

Updated Date - 2021-06-19T19:03:44+05:30 IST