ప్యాకేజీ కోసం తిరిగి అలసిపోయా..

ABN , First Publish Date - 2020-09-25T07:54:31+05:30 IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో ఓ వ్యక్తి గురువారం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి.. హల్‌చల్‌ చేశాడు...

ప్యాకేజీ కోసం తిరిగి అలసిపోయా..

  • ఆర్డీవో కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న భూనిర్వాసితుడు
  • కొండపోచమ్మ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రాలేదంటూ ఆవేదన
  • ఆర్డీవోను చంపుతానని బెదిరింపులు

గజ్వేల్‌, సెప్టెంబరు 24:  సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో ఓ వ్యక్తి గురువారం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి.. హల్‌చల్‌ చేశాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని ఐవోసీ(ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసు కాంప్లెక్స్‌)లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు మండలం కొండపోచమ్మసాగర్‌ ముంపు గ్రామమైన మామిడ్యాలకు చెందిన సబ్బని జానకిరాములు.. గురువారం బాటిల్‌లో పెట్రోల్‌తో ఆర్డీవో కార్యాలయానికి వచ్చాడు. ఆర్డీవో లేకపోవడంతో.. బాటిల్‌ను తెరిచి పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. దీన్ని గమనించిన కార్యాలయ సిబ్బందితోపాటు పలువురు కేకలు వేయడంతో అలజడి చెలరేగింది. తన వద్దకు ఎవరూ రావొద్దంటూ జానకిరాములు లైటర్‌ను చేతులో పట్టుకుని బెదిరించాడు.


అనంతరం ఆవేశంగా మాట్లాడుతూ.. ‘‘నా కుటుంబ సభ్యులు ప్రగతిభవన్‌ ఎదుట ఉన్నారు. ఏదో ఒక రోజు నేను చావడంతోపాటు ఆర్డీవోను కూడా చంపుతాను’’ అంటూ ఊగిపోయాడు. తన కుటుంబం కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటోందని చెప్పాడు. తనకున్న వ్యవసాయభూమి, 350 గజాల ఇంటిస్థలాన్ని కొండపోచమ్మసాగర్‌ ప్రాజెక్టులో కోల్పోయినట్లు వివరించాడు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం కొన్నాళ్లుగా అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయానని చెప్పాడు. ఊర్లో ఉండని వారికి, లక్షాధికారులకూ ప్యాకేజీ ఇచ్చారని, తనను మాత్రం చుట్టూ తిప్పుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పలువురు అతడిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు.  


ప్యాకేజీకి అర్హుడు కాదు: ఆర్డీవో

జానకిరాములు 15ఏళ్లుగా కూకట్‌పల్లి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నందున ఆర్‌అండ్‌ఆర్‌, ప్యాకేజీకి అర్హుడు కాదని గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి వెల్లడించారు. జానకిరాములుకు 20 గుంటల భూమి ఉందని, ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించిన కూలిపోయిన ఇంటికి పరిహారాన్ని కూడా అందించామన్నారు.


Updated Date - 2020-09-25T07:54:31+05:30 IST