Abn logo
Aug 31 2021 @ 04:10AM

Anti-mask Campaign నిర్వహించాడు.. కరోనాతోనే కన్నుమూశాడు

టెక్సాస్: కోవిడ్‌ను నియంత్రించాలంటే మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలని, పరిశుభ్రంగా ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే కొంత మేర కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. కానీ వీటికి వ్యతిరేకంగా అనేక దేశాల్లో నిరసనలు కొనసాగాయి. ముఖ్యంగా అమెరికాలో తాము మాస్కులు పెట్టుకోమంటూ ఓ వర్గం ప్రజలు రోడ్లెక్కి మరీ నిరసనలు తెలిపారు. అలా రోడ్డెక్కి యాంటీ-మాస్క్ క్యాంపెయిన్ నిర్వహించిన ఓ వ్యక్తి తాజాగా కోవిడ్ 19 కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు నెల రోజుల పాటు ఆ మహమ్మారితో పోరాడి చివరకు తుది శ్వాస విడిచాడు.

వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ టెక్సాస్ కమ్యూనిటీకి చెందిన కాలెబ్ వాల్లేస్ అనే వ్యక్తి శనివారం కోవిడ్‌తో మృతి చెందాడు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో వాల్లేస్.. మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ వినియోగించడం, ఇతర కోవిడ్ నియంత్రణ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాడు. ముఖ్యంగా మాస్కులు పెట్టుకోవడం వల్ల ఆందోళన, ఆత్మన్యూనతా భావాలు ప్రబలుతాయంటూ క్యాంపెయిన్ చేశాడు. అయితే ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత వాల్లేస్‌కు కరోనా సోకింది. అతడిని వైద్యులు వెంటనే ఎమర్జెన్సీ ఐసీయూకు మార్చారు. అప్పటి నుంచి అతడి ఆరోగ్య పరిస్థితిపై భార్య జెస్సికా వాల్లేస్ గో ఫండ్ మి అనే వెబ్ సైట్‌లో అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే శనివారం ఆమె పెట్టిన పోస్టుతో కాల్లేబ్ మరణించినట్లు తెలిసింది. ‘కాల్లేబ్ ప్రశాంతంగా వెళ్లిపోయాడు. అతడు మన హృదయాల్లో, ఆలోచనల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు’ అంటూ జెస్సికా పోస్ట్ చేసింది.

కాగా.. కాల్లేబ్ 2020 జూల్ 4న శాన్-యాంజెలో ప్రాంతంలో ‘ద ఫ్రీడం ర్యాలీ’ అనే భారీ ర్యాలీని నిర్వహించాడు. కోవిడ్ మాస్కులు ధరించడం, వ్యాపారాలను మూసేయడం, కోవిడ్ వెనకున్న శాస్త్రీయత, మీడియా వ్యవస్థ అనుసరిస్తున్న పద్ధతి వంటి విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జూలై 26 నుంచి కాల్లేబ్‌లో కోవిడ్ లక్షణాలు కనిపించినట్లు జెస్సికా వెల్లడిచింది. అయితే కోవిడ్ టెస్ట్ చేయించుకునేందుకు మాత్రం అతడు నిరాకరించాడని, హాస్టటల్‌కు కూడా వెళ్లేందుకు అంగీకరించలేదని ఆమె తెలిపింది. అంతేకాకుండా తనకు తానే వైద్యం చేసుకుంటూ భారీ స్థాయిలో విటమిన్ సీ, జింక్ ఆస్ప్రిన్, ఐవర్‌మెక్టిన్, యాంటీ-పారాసైటిక్ మాత్రలను తీసుకున్నాడని తెలిపింది. అయితే ఇలాంటి మందులు తీసుకోవద్దని వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్నా కాల్లేబ్ పట్టించుకోలేదు. ‘ఇక 30వ తేదీని పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించాం. ఆగస్టు 8వ తేదీ వరకు అతడు అపస్మారక స్థితిలో వెంటిలేటర్ సాయంతో ఉన్నాడు. అయితే ఆ తర్వాత కొద్దిగా తెలివి వచ్చినా.. కోవిడ్ కారణంగా పరిస్థితి దిగజారుతూ వెళ్లింది. చివరికి శనివారం తుది శ్వాస విడిచాడు’ అని జెస్సికా వెల్లడించింది. శాన్ యాంజెలో స్టాండర్డ్ టైమ్స్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జెస్సికా, కాల్లేబ్‌లకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. ప్రస్తుతం నాలుగో సారి జెస్సికా గర్భంతో ఉంది.

తాజా వార్తలుమరిన్ని...