పెళ్లి చేసుకున్న సంగతి మర్చిపోయాడు.. భార్యకే రెండోసారి ప్రపోజ్ చేశాడు..!

ABN , First Publish Date - 2021-06-18T02:47:34+05:30 IST

మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి అనారోగ్యానికి గురైతే తట్టుకోలేం.

పెళ్లి చేసుకున్న సంగతి మర్చిపోయాడు.. భార్యకే రెండోసారి ప్రపోజ్ చేశాడు..!

మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి అనారోగ్యానికి గురైతే తట్టుకోలేం. అంతగా ప్రేమించిన వ్యక్తి మనం ఎవరో మర్చిపోతే.. అంతకంటే విషాదం ఇంకోటి ఉండదు. అల్జీమర్స్ వ్యాధికి గురైన వ్యక్తుల సన్నిహితులు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటారు. వయసు మీద పడ్డాక దాడి చేసే అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపక శక్తిని పూర్తిగా హరించి వేస్తుంది. 


యూఎస్‌లోని కనెక్టికట్‌కు చెందిన పీటర్ గత డిసెంబర్‌లో టీవీలో ఓ పెళ్లి వేడుకను చూస్తూ పక్కనున్న లీసాకు ప్రపోజ్ చేశాడు. `మనం పెళ్లి చేసుకుందామా?` అని అడిగాడు. లీసాకు నవ్వాలో, ఏడవాలో తెలియలేదు. ఎందుకంటే వారిద్దరూ అప్పటికే భార్యాభర్తలు. పీటర్ (53) అప్పటికి కొన్నేళ్ల క్రితమే అల్జీమర్స్ వ్యాధికి గురై మొత్తం మర్చిపోయాడు. అయినా పీటర్‌ను లీసా జాగ్రత్తగా చూసుకుంటోంది. దీంతో లీసాను ఇష్టపడిన పీటర్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. 


తెలిసినా, తెలియకపోయినా తనను ఎంతగానో ఇష్టపడుతున్న భర్తతో లీసా రెండోసారి పెళ్లికి సిద్ధమైంది. అతడి సంతోషం కోసం రెండోసారి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు వారిద్దరూ సంతోషంగానే గడిపారు. ఆ తర్వాత వ్యాధి ముదరడంతో ఆ పెళ్లి వేడుకను కూడా పీటర్ మర్చిపోయాడు. కాగా, తన భర్త పీటర్ గురించి, రెండో పెళ్లి గురించి లీసా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసింది. అల్జీమర్స్ వ్యాధి గురించి సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగిస్తోంది. 

Updated Date - 2021-06-18T02:47:34+05:30 IST