ఇంకా బతకాలని ఉంది.. ‘తల’కిందులు వ్యక్తి

ABN , First Publish Date - 2021-03-27T22:53:36+05:30 IST

చావు చాలా భయంకరమైనది. కానీ అదృష్టం ఏంటంటే.. అది మనల్ని ఎప్పుడు కబళిస్తుందో ఎవరికీ తెలుసుకోలేరు. దీంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా గడిపేస్తుంటారు. అయితే ఎవరికైనా ఎప్పుడు చనిపోతామో ముందుగా తెలిసిందంటే....

ఇంకా బతకాలని ఉంది.. ‘తల’కిందులు వ్యక్తి

సావోపోలో: కనీసం 24 గంటలు కూడా బతకడని డాక్టర్లు చెప్పిన ఓ శిశువు నేడు 44 ఏళ్ల వ్యక్తిగా మారాడు. పుట్టుకతోనే ఆర్త్రోగ్రిపోసిస్ మల్టీప్లెక్స్ కాన్‌జెనీటా అనే వ్యాధితో జన్మించాడు బ్రెజిల్‌కు చెందిన క్లాడియో వియెరా డీ ఒలీవిరా. ఈ వ్యాధి కారణంగా ఒలీవిరా కాలి కండరాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అలాగే అతడి చేతులు ఛాతీకి అతుక్కుపోయాయి. తల కూడా వెనక్కి వంగిపోయి తలకిందులుగా మారింది. దీంతో చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతడు మాట్లాడుతూ.. తనకు చనిపోవాలని లేదని, మరిన్ని సంవత్సరాలు బతకాలని ఉందని అంటున్నాడు. ‘ఇలా బతకడానికి నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. అందరిలా సాధారణంగానే జీవించాను. ఇంకా చాలా సంవత్సరాలు బతకాలని అనుకుంటున్నాను’ అని ఒలీవిరా చెప్పుకొచ్చాడు. 


ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నప్పటికీ తనతో పాటు చుట్టుపక్కల వారిని చైతన్యపరిచేందుకు ఒలీవిరా ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఎన్నో పబ్లిక్ స్పీచ్‌లలో పాల్గొని జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలో చెబుతుంటాడు. బ్రెజిల్ లోని బహియా ప్రాంతంలో ఒలీవిరా నివశిస్తున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో అతడు గతేడాది నుంచి ఇంటికే పరిమితమైపోయాడు. కానీ, ఈ మహమ్మారి బాధ వదిలిపెట్టగానే తాను మళ్లీ బయటకెళతానని అనేకచోట్ల స్పీచ్‌లు ఇస్తానని ఒలీవిరా చెబుతున్నాడు.


కాగా.. అర్త్రొగ్రిపోసిస్ మల్టీప్లెక్స్ కాంజెనీటా వ్యధివల్ల మనిషి శరీరంలో కీళ్లు దెబ్బతింటాయి. శరీరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ కీళ్లపై దీని ప్రభావం ఉంటుంది. దీని ప్రభావానికి లోనైన కీళ్లు పూర్తిగా ముడుచుకుపోవడం కానీ, లేదా నిటారుగా ఆగిపోవడం కానీ జరుగుతుంది. దీనివల్ల ఆ కీళ్లు ఏ మాత్రం పనిచేయవు. దీంతో శరీరంలో అనేక రుగ్మతలకు తలెత్తుతాయి.



Updated Date - 2021-03-27T22:53:36+05:30 IST