ఆస్కార్ బరిలో.. 900కు పైగా అవార్డ్స్ అందుకున్న ‘మనసానమః’

విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన లఘు చిత్రం ‘మనసానమః’. దృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడు దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించారు. గతేడాది యూట్యూబ్‌లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం.. ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది. ఆస్కార్ క్వాలిఫైలో ఉన్న ‘మనసానమః’కు ఈ నెల 10 నుండి ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు దీపక్‌తో పాటు నటీనటులు విరాజ్, దృషిక, సినిమాటోగ్రాఫర్ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘మనసానమః’ చిత్ర విశేషాలను, ఆస్కార్ పోటీలో ఎంపికపై వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రేమ కథనే కొత్తగా ఎలా తెరకెక్కించాలని ఆలోచించినప్పుడు కంప్లీట్ రివర్స్ స్క్రీన్‌ప్లేతో మ్యూజికల్‌గా చేద్దామని అనుకున్నాం. కథను మొత్తం రివర్స్‌లో తీయడం షూటింగ్ టైమ్‌లో పెద్ద ఛాలెంజ్. ప్రొడక్షన్ టైమ్‌లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. మంచి టీమ్‌తో అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించాం. మనసానమః కు ఇంటర్నేషనల్‌గా వందల అవార్డులు రావడం మాకెంతో ఎంకరేజింగ్‌గా ఉంది. ఈ నెల 10న ఆస్కార్ ఓటింగ్‌లోనూ విన్ అవుతామని ఆశిస్తున్నాం. నా అభిమాన దర్శకుడు సుకుమార్. త్వరలోనే ఫీచర్ ఫిల్మ్ చేయబోతున్నాను..’’ అని తెలుపగా హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘దీపక్ మనసానమః కథ చెప్పినప్పుడు చెప్పినట్లు స్క్రీన్ మీదకు తీసుకురాగలడా అనిపించింది. కానీ షార్ట్ ఫిలిం కంప్లీట్ అయ్యాక అతని వర్క్ ఏంటో తెలిసింది. గతేడాది లాక్‌డౌన్‌లో యూట్యూబ్‌లో రిలీజ్ చేశాం. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో గౌతమ్ మీనన్‌గారి ప్రెజెంట్స్‌తో రిలీజ్ చేశారు. అలాగే కన్నడలో కేజీఎఫ్ కో ప్రొడ్యూసర్స్ మనసానమః విడుదల చేశారు. ఒక తెలుగు షార్ట్ ఫిలింకు ఇంటర్నేషనల్లీ 900 పైగా అవార్డ్స్ రావడం గర్వంగా ఉంది. ఆడియెన్స్ అందరికీ థాంక్స్ చెబుతున్నాం. ఆస్కార్ క్వాలిఫై ఓటింగ్‌పై పాజిటివ్‌గా ఉన్నాం..’’ అని తెలిపారు.


నా మొదటి సినిమాకే ఇంతలా అప్రిషియేషన్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ దృషిక అంటే.. మనసానమః అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపునకు సంతోషాన్ని వ్యక్తం చేశారు సినిమాటోగ్రాఫర్ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్. ఆస్కార్ క్వాలిఫై ఓటింగ్‌లోనూ విన్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement