Sep 24 2021 @ 19:27PM

Manchu Vishnu: ఆ ప్యానల్‌కు పని చేసేంత సామర్థ్యం లేదు

మార్పు తీసుకురాగలనే ధైర్యంతో వస్తున్నా

ఆ ప్యానల్‌కు పని చేసేంత సామర్థ్యం లేదు

ఆ మాటలను 99 శాతం ఆమోదించను

పని కల్పించడమే నా లక్ష్యం

‘విష్ణును ఎన్నికల నుంచి తప్పుకోమనండి’ అని ఫోన్‌ చేశారు...

అంతకుముందు వరకూ నాన్న జోక్యం లేదు...

600 మందికి ఫోన్‌ చేసి, ‘విష్ణు ఎన్నికల్లో దిగుతున్నాడు’ అని చెప్పారు


‘మా’ అసోసియేషన్‌ అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు గురువారం తన ప్యానల్‌ సభ్యులను ప్రకటించారు. ప్యానల్‌ను పరిచయం చేస్తూ శుక్రవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ‘మా’ ప్రెసిడెంట్‌ అనేది బిరుదు కాదని, బాధ్యత అని విష్ణు అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘మా’ పుట్టి 25 వసంతాలు పూర్తయింది. చాలా మంది కళాకారులకు చెన్నై అన్నం పెట్టింది. ఇప్పటికీ పెడుతూనే ఉంది. తెలుగు ఆర్టిస్ట్‌లకు ప్రత్యేక ఒక సంఘం ఉండాలని ‘మా’ను ఏర్పాటు చేశారు. ఎంతోమంది దీని కోసం కృషి చేశారు. నటీనటుల జీవితాలు తెరపై కనిపించినట్లు రంగులమయంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. మేకప్‌ తీస్తే ఆర్టిస్ట్‌లది కూడా సాధారణ జీవితమే. ఒక నటుడికి ఏడాది మొత్తం పని ఉండొచ్చు. తర్వాతి ఏడాది మూడు నెలలు కూడా పని దొరకక పోవచ్చు. నటుడి కష్టాలు, ఆవేదన అతనికి మాత్రమే తెలుసు. ఎవరితోనూ పంచుకోలేడు. అందుకే ఆర్టిస్ట్‌లు కోసం, మా అందరి కోసం ‘మా’ ఉంది. మా బాధ్యతను నేను సమర్థంగా తీసుకోగలననే నమ్మకంతో వస్తున్నా. ఎన్నికలు ఈ విధంగా జరగడం పట్ల ఎవరూ ఆనందంగా లేరు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం నాన్నకు ఇష్టం లేదు. ఆయన 46ఏళ్ల నట జీవితంలో  ఆర్టిస్ట్‌లు ఈ స్థాయిలో విడిపోలేదు. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ రాకూడదు. 

 

99 శాతం నేను ఆమోదించను. 

2015–16లో దాసరి నారాయణరావుగారు, మురళీమోహన్‌గారు నన్ను ఎగ్జీక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేయమన్నారు. ఇదే విషయాన్ని నాన్నతో చెబితే ‘ఆ పదవి బాధ్య్యతతో కూడుకున్నది. నీ అనుభవం సరిపోదు.  నీ బిజీలో ఆర్టిస్ట్‌ల సంక్షేమం కోసం సమయం కేటాయించలేవన్నారు. ‘మా’లో మార్పు తీసుకురాగలనే ధైర్యంతో వస్తున్నా. మాలో ఉన్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సత్తా నా ప్యానల్‌కు ఉంది.  ప్రత్యర్థి ప్యానెల్‌లో మంచి నటులున్నారు. కానీ వారికి అసోసియేషన్‌లో పనిచేేసంత సామర్థ్యం లేదు. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగా పనిచేయలేరు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్పగలను. వాళ్ల గురించి ఇండస్ర్టీలో అందరికీ తెలుసు. వాళ్ల ప్రసంగాలూ విన్నా. వారి మాటలను 99 శాతం నేను ఆమోదించను. ‘మా’ ఒక ఛారిటీ ఆర్గనైజేషన్‌ కాదని ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ అంది. పెద్దలకు పించన్‌ ఇవ్వడాన్ని ఛారిటీ అని ఎలా అంటారు? అది మన బాధ్యత. రేపు వయసు అయిపోయిన తర్వాత మనల్ని కూడా చూసుకోవాలి కదా! 


అప్పుడే నాన్న జోక్యం చేసుకున్నారు...

‘మా’లో ఉన్న 900 మంది ఒక కుటుంబం. 900 మంది 2000 మంది కావాలి. కొత్త టాలెంట్‌ ఇండస్ర్టీలోకి రావాలి. అందరికీ లైఫ్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వడమే నా మొదటి లక్ష్యం. ఆ ప్యానల్‌లో ఎడ్యుకేషన్‌ పాలసీ గురించి ఏమైనా మాట్లడారా? దీనిపై మాట్లాడటానికి వస్తే, నేను రెడీగా ఉన్నా. అందరికీ పని కల్పించడమే నా లక్ష్యం. బాబూమోహన్‌, పృథ్వీలాంటి సీనియర్‌ నటుల అనుభవం నాకు కావాలి. దయచేసి మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం చేసుకోవద్దు. ‘విష్ణు ఎన్నికల్లో పాల్గొంటాడు అవకాశం ఇవ్వండి’ అని మా నాన్న ఎవరినీ అడగలేదు. అయితే, ‘విష్ణును ఎన్నికల నుంచి తప్పుకోమనండి’ అని ఒకరు ఫోన్‌ చేశారు. ఆ తర్వాతే నాన్న రంగంలోకి దిగారు. అసోసియేషన్‌లో ఉన్న 600 మందికి ఫోన్‌ చేసి, ‘విష్ణు ఎన్నికల్లో దిగుతున్నాడు. మీ సపోర్ట్‌ కావాలి’ అని అడిగారు. అంతకుముందు వరకూ నాన్న ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు.