మోసమే సీఎం కేసీఆర్‌ నైజం

ABN , First Publish Date - 2021-08-03T05:08:19+05:30 IST

మోసమే సీఎం కేసీఆర్‌ నైజం

మోసమే సీఎం కేసీఆర్‌ నైజం
సమావేశంలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 


వడ్డెపల్లి, ఆగస్టు 2 : దళిత సమాజాన్ని మోసం చేయడమే సీఎం  కేసీఆర్‌ నైజమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడక ముందే రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం హన్మకొండలోని కల్యాణి ఫంక్షన్‌హాల్‌లో ఎస్సీల సమగ్రాభివృద్ధి సాధన సమితి నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దళితబంధు పథకం పేరుతో మరోసారి దళితులను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, ఓట్ల కోసం దళితులను భ్రమల్లో దింపేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలవుతున్నా  దళితులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడు ముఖ్యమంత్రి అయితే  100 శాతం భూమి దళితులకు వచ్చేదని, దళిత సాధికారత సాధ్యమయ్యేదన్నారు. టీఆర్‌ఎ్‌సలోని దళిత నేతలు కడియం శ్రీహరి, డాక్టర్‌ టి. రాజయ్య, కొప్పుల ఈశ్వర్‌, అరూరి రమేష్‌ సీఎం కేసీఆర్‌కు కనబడడం లేదా అని విమర్శించారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత ఏ రంగంలోనూ ఒక్క శాతం కూడా దళితుల అభివృద్ధి జరగలేదని, ఈ నెల 16 లోపు హుజూరాబాద్‌లో ఒకే సమయంలో 20 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు చేయాలన్నారు. 100 రోజులులోపు  రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ నెల 9న కలెక్టరేట్ల ఎదుట ధర్నా, 10 నుంచి 15 వరకు మండలకేంద్రాల్లో మహాదీక్షలు, 16 నుంచి సెప్టెంబరు 4 వరకు నియోజకవర్గాల్లో మహాపాదయాత్రలు, 5న హుజూరాబాద్‌లో దళిత గర్జన మహాసభను నిర్వహిస్తామన్నారు.


ఎన్నికల ఎత్తుగడే..: అద్దంకి దయాకర్‌

దళితబంధు పథకం సీఎం కేసీఆర్‌ ఎన్నికల ఎత్తుగడేనని మలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు. కోకాపేట భూములను అమ్మితే వచ్చిన రూ. 1100 కోట్లతో రాష్ట్రంలోని దళితులందరికీ మూడెకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితులు ఓట్లు అమ్ముకునే సంస్కృతిని విడనాడాలన్నారు. దళిత సమాజానికి మందకృష్ణ దిక్సూచి అని ఆయన నాయకత్వంలో మాల, మాదిగలు సంఘటితం కావాలన్నారు. 

ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్‌ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఎంఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌ గౌడ్‌, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌ కుమార్‌, డీబీఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్‌, బేడ బుడగ జంగాల రాష్ట్ర కన్వీనర్‌ వారణాసి స్వామి, మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు కన్నె బాబురావు, రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌, అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారపు రవిప్రసాద్‌, ప్రజా సంఘాల నాయకులు బొక్కల నారాయణ, పుట్ట రవి, డాక్టర్‌ రాజమౌళి, భిక్షపతి, చుంచు రాజేందర్‌, గోవింద్‌ నరేష్‌, దుర్గం భాస్కర్‌,  సింధు యక్షగాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజవెల్లి గణపతి, ఆరెపెల్లి పవన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:08:19+05:30 IST