ప్రైవేటు వర్సిటీలను అడ్డుకునేందుకు అక్టోబరులో మహా దీక్ష

ABN , First Publish Date - 2020-09-25T07:01:03+05:30 IST

ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును అడ్డుకునేందుకు అక్టోబరులో మహా దీక్ష నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు...

ప్రైవేటు వర్సిటీలను అడ్డుకునేందుకు అక్టోబరులో మహా దీక్ష

  • మందకృష్ణ

నిజామాబాద్‌ రూరల్‌/మెదక్‌ రూరల్‌, సెప్టెంబరు 24 : ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును అడ్డుకునేందుకు అక్టోబరులో మహా దీక్ష నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. అందరినీ సంఘటిత పర్చేందుకే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం నిజామాబాద్‌, మెదక్‌లలో జరిగిన ఆయా ఉమ్మడి జిల్లాల విస్త్రృత కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ, విద్యుత్తు బిల్లులు విషం, రాక్షస బిల్లులైతే  రిజర్వేషన్‌లే ఇవ్వని ప్రైవేట్‌ యూనివర్సిటీ బిల్లును సీఎం కేసీఆర్‌ ఎందుకు వ్యతిరేకించడంలేదని ప్రశ్నించారు.


ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు విషం పూసిన కత్తిలాంటిదని అన్నారు. సుప్రీంకోర్టు త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై పునఃసమీక్షించనుందని, అందుకు తమ వాదాన్ని బలంగా వినిపించడానికి సమర్థులైన లాయర్లను నియమించుకునేందుకు ప్రతీ ఇంటి నుంచి రూపాయి నుంచి లక్ష రూపాయల దాకా చందాలు సమీకరించాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మాదిగలనుమోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ పోరాటం చివరి దశకు వచ్చిందని, గెలవడమే తరువాయి అని మందకృష్ణ అన్నారు. 

Updated Date - 2020-09-25T07:01:03+05:30 IST