Abn logo
Sep 23 2020 @ 01:07AM

మందబలం, ప్రజాస్వామ్యం

ఆదివారం నాడు రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లులను ఆమోదించిన తీరు భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక మరకగా మిగిలిపోతుంది. రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి, సభ్యుల మైక్ లను పనిచేయకుండా చేసి, ఓటింగ్ విభజన కోరుతున్నప్పటికీ మూజువాణీ ఓటుతో బిల్లులను ఆమోదించినట్టు ప్రకటించడం ఇంకా పార్లమెంటరీ సంప్రదాయాలపై విశ్వాసం ఉన్నవారికి దిగ్భ్రాంతి కలగజేసింది. ఆదివారం నాటి పరిణామాలకు, సోమవారంనాటి సస్పెన్షన్లకు ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. లోక్ సభ కార్యక్రమాలను ప్రతిపక్షాలు మూకుమ్మడిగా బహిష్కరిస్తుండగానే, మంగళవారం నాడు మూడు వివాదాస్పదమైన కార్మిక బిల్లుల ఆమోదం జరిగిపోయింది. కరోనా వల్ల ఉత్పన్నమయిన పరిస్థితులను కారణంగా చెబుతూ, పార్లమెంటు సమావేశాలను ముగింపజేసే ముందు, తాము కోరుకుంటున్న శాసనాలన్నిటికీ ఆమోదముద్ర వేయించడానికి ప్రభుత్వం ఆత్రుతగా ఉన్నట్టు అర్థమవుతోంది. 


ఆదివారం జరిగిన పరిణామాలను కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిభజన బిల్లు ఆమోదం జరిగిన పరిస్థితులతో పోల్చుతున్నారు కానీ, ఆ పోలిక సరి అయినది కాదు. 2014లో రాష్ట్రవిభజన బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు నాటి అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఆ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి. ఎంతటి చర్చ జరిగినా, చివరకు ఓటింగ్ జరిగితే బిల్లు పాస్ కావడం ఖాయమే. నాడు, సభా కార్యక్రమాలకు భంగం కలిగే పరిస్థితులలో తలుపులు మూయడం, మైకులు పనిచేయకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడి, నాటి ప్రభుత్వం విమర్శల పాలయింది. ఆదివారం నాడు జరిగింది అటువంటిది కాదు. మూజువాణీ ఓటు కాక, ప్రతిపక్షాలు కోరినట్టు ఓట్ల లెక్కింపు జరిగితే, బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందేవి కావు. శాసనాలను చేయడం అనే ముఖ్యమైన పార్లమెంటరీ ప్రక్రియలో, సభికుల ఆమోదం అనే మరో ముఖ్యమైన ప్రజాస్వామిక అంశం మరుగున పడిందన్న మాట.


ప్రజాబాహుళ్యం నుంచి భారీసంఖ్యలో ఓట్లు పొందినంత మాత్రాన, యథేచ్ఛగా పాలించడానికి అవకాశం దొరికినట్టు కాదు. పరిపాలన నియమబద్ధంగా ఉండాలి. రూపొందించే నియమాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి, సహజన్యాయానికి లోబడి శాసనాల రూపకల్పన జరగాలి. రూపొందించే శాసనాలపై లోతైన చర్చ, నిశితమైన పరిశీలన జరగడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడే పక్షాలు, తాము అధికారంలోకి రాగానే, ఎట్లా విశృంఖలమైన అధికారాన్ని చెలాయించాలా అని ప్రయత్నిస్తుంటాయి. శాసనసభ ఎందుకు, అందులో చర్చలు ఎందుకు అని రాష్ట్రాల స్థాయిలో అనుకున్నట్టే, తూతూ మంత్రంగా పార్లమెంటు సమావేశాలను నిర్వహించి, తాము అనుకున్న బిల్లులకు ఆమోదముద్ర సాధించుకుని బయటపడదామని జాతీయస్థాయిలోనూ అనుకుంటున్నారు. ముఖ్యమైన బిల్లుల మీద ఎన్ని రోజులైనా చర్చించుకుందామనే ముఖ్యమంత్రులు, ఒక్కరోజులో ముగింపు పలికిన సందర్భం ఈ మధ్యే చూశాము. ప్రజాప్రయోజనాలకు భంగం కలుగుతుందనే విమర్శలు ఎదుర్కొనే శాసనాల విషయంలో ప్రభుత్వాలు మరింత నామమాత్రంగా చర్చలను కోరుకుంటాయి. సభలో చర్చకు మొహం చాటేసేవారు, వీధుల్లో ఉద్యమాలను సహించగలరా? 


2014లో మొదటిసారి అధికారం చేపట్టినప్పటి నుంచి నరేంద్రమోదీ ప్రభుత్వం, సమాజంలోనూ, చట్ట సభల్లోనూ తగినంత చర్చకు ఆస్కారం ఇవ్వకుండా చట్టాలు చేయడానికి ఉత్సాహపడుతోంది. వ్యవసాయ రంగ బిల్లుల గురించి ప్రతిపక్షాలు ప్రధానంగా కోరినది- బిల్లును నిశిత పరిశీలనకు సెలక్ట్ కమిటీకి నివేదించమని. నిజానికి ప్రతి ప్రభుత్వ విభాగానికి శాసనాల పర్యవేక్షణకు, పరీక్షకు ఒక పార్లమెంటరీ స్థాయీ సంఘం ఉంటుంది. కొత్తగా చేసే శాసనాలు కానీ, నిర్ణయాలు కానీ ఆ సంఘం పరిశీలించాలి. జమ్మూకశ్మీర్ ప్రతిపత్తిని తొలగించిన బిల్లు కానీ, త్రిపుల్ తలాఖ్ బిల్లు కానీ, యుపా బిల్లు కానీ, పౌరసత్వ బిల్లు కానీ- ఏవీ అటువంటి ప్రక్రియ గుండా పార్లమెంటులోకి ప్రవేశించలేదు. 


లోక్ సభలో అసాధారణ మెజారిటీ ఉండడంతో చర్చ జరగకుండా నేరుగా ఆమోదింపజేస్తున్నారు. రాజ్యసభలో తగినంత బలం లేకపోవడంతో, పద్ధతులను తోసిరాజని ఫలితం సాధించుకుంటున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు ప్రతిపక్షాలు సభలో తీవ్ర నిరసన తెలిపిన సందర్భాన్ని, బిహారీ ఆత్మ గౌరవాన్ని గాయపరచడంగా అభివర్ణించి అక్కడ ప్రచారం చేస్తున్నారంటే, ఏ స్థాయిలో రాజకీయాలు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం వంటి దేశంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు ఉండే వాతావరణం వేరు, వారి ఎంపికల మీద ప్రభావం వేసే అంశాలు వేరు. వారి ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినవారు, ఆ ప్రజల ప్రయోజనాలకే భంగకరమైన నిర్ణయాలు తీసుకుంటే, అది తప్పు అని చెప్పే వారు లేకపోతే, చెప్పడానికి అవకాశం లేకపోతే, అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? అన్నిటి కంటె బాధాకరమైన విషయం- ప్రపంచంలోనూ, దేశంలోనూ నెలకొని ఉన్న కరోనా కల్లోల వాతావరణాన్ని ఆసరా చేసుకుని, అనేక వివాదాస్పద నిర్ణయాలను హడావుడిగా తీసుకోవడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం ఏమాత్రం గౌరవప్రదమైనది కాదు. ఈ తరహా వ్యవహారసరళిని అభివర్ణించడానికి మాటలు చాలవు. కల్లోలజలాలలో చేపల వేట అన్నది చిన్న మాట.


ఈ పరిస్థితికి ప్రధానంగా అధికారపార్టీనే నిందించవలసి ఉన్నా, ప్రతిపక్షాల పాత్ర క్షమార్హమైనది కాదు. వ్యవసాయ బిల్లులు ఆర్డినెన్సుల రూపంలో జూన్‌లోనే వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? పంజాబ్, హర్యానాల్లో రైతులు రోడ్ల మీదికి వచ్చి, తమ అసమ్మతిని తెలిపే దాకా, మహారాష్ట్రలో రైతునేతలు నోరువిప్పేదాకా, రాజకీయపార్టీలకు ఎందుకు తెలియదు? ఈ ప్రభుత్వాన్ని తొలగించి, తాము అధికారంలోకి రావాలని కోరుకుంటున్న పార్టీలే కదా ఇవి, ప్రజల నాడి తెలియదా? కాంగ్రెస్ వ్యవసాయ బిల్లులపై ఇప్పుడు జాతీయస్థాయి ఉద్యమం నిర్వహిస్తుందట. ప్రధానమంత్రికి ప్రజలలో ఆమోదం, అభిమానం ఏ రీతిలో ఉన్నాయో తెలుసుకుందామని ప్రయత్నించిన ఒక ఆంగ్ల పత్రిక, నరేంద్రమోదీకి పల్లెల్లోనూ, పట్నాల్లోనూ మంచి మద్దతు ఉన్నదని నిర్ధారించింది. అయితే, ఆ మద్దతుకు కారణమేంటో కూడా ఆ పత్రిక సూచించింది. ‘ప్రత్యామ్నాయం ఏమీ లేకపోవడం’. ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే, ప్రతిపక్షాలు చేయవలసింది ప్రజలలో ఉన్న ఆకాంక్షలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం. ఆలస్యమైనా వ్యవసాయ బిల్లులు, కార్మిక బిల్లులు అందుకు అవకాశం కల్పిస్తాయి. కావలసింది, సంకల్పబలం, వ్యూహరచన. 

Advertisement
Advertisement
Advertisement