‘కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం నేనే.. 2023లో అధికారం మాదే..’

ABN , First Publish Date - 2020-08-14T18:00:02+05:30 IST

కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేనని, పేద ప్రజల ప్రాణాలను గాలికొదిలి, పేదల భూములను రాబంధుల్లా లాక్కుంటున్న దొరల పాలనకు 2023లో చరమగీతం పాడి మహాజన రాజ్యాన్ని సాధిస్తామని మహాజన సోషలిస్ట్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు

‘కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం నేనే.. 2023లో అధికారం మాదే..’

మహాజన సోషలిస్ట్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ 


హన్మకొండ టౌన్‌(వరంగల్): కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేనని, పేద ప్రజల ప్రాణాలను గాలికొదిలి, పేదల భూములను రాబంధుల్లా లాక్కుంటున్న దొరల పాలనకు 2023లో చరమగీతం పాడి  మహాజన రాజ్యాన్ని సాధిస్తామని మహాజన సోషలిస్ట్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మందకృష్ణ   మాట్లాడుతూ ఎన్నికలకు మూడు సంవత్సరాలకు ముందే కేసీఆర్‌ సాగిస్తున్న దొరల పాలనపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదల ప్రాణాలకు గ్యారంటీ లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి హామీ విషయంలో తిరుగుబాటు రాకుండా 2014లో దళితులకు 3 ఎకరాల భూపంపిణీ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్‌ 2018 నాటికి ఆ ఊసే లేకుండా చేశారని ఆరోపించారు. 30 లక్షల ఎకరాల భూపంపిణీ చేస్తానని ప్రకటించిన కేసీఆర్‌ హామీ నిలుపుకోకపోగా ఇప్పటి వరకు పేదలకు చెందిన లక్ష ఎకరాల భూములు లాక్కున్నారని మందకృష్ణ దుయ్యబట్టారు. కేసీఆర్‌ తన జిల్లాలో కలెక్టరేట్‌ ఏర్పాటు కోసం పేదలను బెదిరించి భూ సేకరణ చేసిన వీఆర్‌వోకు తహసీల్దార్‌గా పదోన్నతి కల్పించాడని ఆయన ఆరోపించారు. 


రాష్ట్రంలో 2023లో దొరల పాలనకు స్వస్తి పలుకుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద ప్రజల భాగస్వామ్యం ఉండే ప్రజా పాలనను సాధిస్తామన్నారు.  వరంగల్‌ లాంటి చారిత్రక నగరాల రూపురేఖలు మారుతాయన్నారు. వరంగల్‌ను శాసన రాజధానిగా చేసుకుని భవిష్యత్‌లో అద్భుత పాలనకు శ్రీకారం చుడుతామన్నారు.  తనపై మూడు మతాలకు సంబంధించిన భగవంతుల ఆశీస్సులున్నాయని శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శివాలయం, చర్చీ, మసీదుల్లో నిద్రిస్తున్నట్లు మందకృష్ణ తెలిపారు.


మహాజన సోషలిస్ట్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రదీప్‌

మహాజన సోషలిస్ట్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా హన్మకొండకు చెందిన  తీగల ప్రదీప్‌గౌడ్‌ను నియమిస్తున్నట్లు మందకృష్ణ ప్రకటించారు. తనకు అవకాశం ఇచ్చిన మందకృష్ణకు ఈ సందర్భంగా ప్రదీప్‌గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు.  


Updated Date - 2020-08-14T18:00:02+05:30 IST