కమండల్‌ వర్సెస్‌ మండల్‌ !

ABN , First Publish Date - 2022-01-17T09:26:44+05:30 IST

యూపీలో కేవలం యాదవులే కాక కుర్మీ, మౌర్య, కుశ్వాహా, సైనీ, రాజ్‌భర్‌ తదితర వెనుకబడిన వర్గాల ఓట్లు కీలకం.

కమండల్‌ వర్సెస్‌ మండల్‌ !

  • యూపీలో బీజేపీకి బీసీలు దూరం.. 
  • యోగి కేబినెట్‌ నుంచి ఒక్కరొక్కరుగా నిష్క్రమణ
  • ఆత్మరక్షణలో కమలనాథులు

ఉత్తరప్రదేశ్‌లో కమండల్‌, మండల్‌ రాజకీయాలు మరో రూపంలో తెరపైకి వస్తున్నాయి. 2017 ఎన్నికల్లో మద్దతిచ్చిన యాదవేతర ఓబీసీ వర్గాల నేతలు క్రమంగా బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఆయా వర్గాల్లో పేరు ప్రఖ్యాతులున్న మంత్రులు ఒక్కరొక్కరుగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంత్రివర్గానికి రాజీనామా చేస్తున్నారు. మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోతున్నారు.


(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి): యూపీలో కేవలం యాదవులే కాక కుర్మీ, మౌర్య, కుశ్వాహా, సైనీ, రాజ్‌భర్‌ తదితర వెనుకబడిన వర్గాల ఓట్లు కీలకం. గత ఎన్నికల ముందు వరకు యాదవేతర ఓబీసీలు మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ నాయకురాలు మాయావతికి, మరో మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కు మద్దతిచ్చేవారు. అఖిలేశ్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లూ యాదవ్‌-ముస్లిం ఓట్లే తనకు ముఖ్యం అన్నట్లుగా వ్యవహరించారు. ఫలితంగా యాదవేతర ఓబీసీలు దూరమయ్యారు. అటు మాయావతి కూడా బలహీనపడిపోవడంతో నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చక్రం తిప్పి.. యాదవేతర ఓబీసీ నేతలందరినీ బీజేపీలోకి తీసుకొచ్చారు. వీరిలో ఇటీవల యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌ నుంచి వైదొలగిన సీనియర్‌ మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య ముఖ్యుడు. ఈయనకు మౌర్య వర్గంలో మంచి పలుకుబడి ఉంది.


అమిత్‌షా పిలుపు మేరకు బీజేపీలో చేరిన ఈయన యోగి కేబినెట్‌లో కార్మిక మంత్రిగా పనిచేశారు. మంగళవారం పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈయన సారథ్యంలోనే మిగతా ఓబీసీ నేతలు కూడబలుక్కుని బీజేపీకి గుడ్‌బై చెప్పి అఖిలేశ్‌తో చేరుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. వీరంతా యోగి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బుధవారం న్యాయ మంత్రి దారాసింగ్‌ చౌహాన్‌, గురువారం మరో ఓబీసీ కీలక నేత, ఆయుష్‌ శాఖ మంత్రి ధరం సింగ్‌ సైనీ కూడా రాజీనామా చేయడంతో వరుసగా మూడో రోజు మూడో మంత్రి తప్పుకొన్నట్లయింది. ఈ ముగ్గురితో పాటు మొత్తంగా ఇప్పటికి మొత్తం 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.


అఖిలేశ్‌లో మార్పు..

2012 నుంచి 17 వరకు యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్‌ హయాంలో సమాజ్‌వాదీ పార్టీకి ‘ముస్లిం-యాదవ్‌’ పార్టీగా ముద్రపడింది. బ్రాహ్మణ, దళిత, వైశ్య, జాట్‌, యాదవేతర ఓబీసీ వర్గాలను పట్టించుకోలేదు. అయితే ఈ ఐదేళ్లలో అఖిలేశ్‌ కూడా మారారని.. కీలక వర్గాలైన బ్రాహ్మణ, దళితులకు చేరువయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


యోగి తీరే కారణం..

సీఎం యోగి ఏకపక్ష వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకే ఇబ్బందిగా మారింది. ఆయనతో విభేదాల కారణంగా మిత్రపక్షం నేత సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎ్‌సపీ) నేత ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ కేబినెట్‌ నుంచి.. ఎన్‌డీఏ నుంచి వైదొలిగారు. తాజా ఎన్నికల్లో అఖిలేశ్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ఓబీసీ మంత్రులు కూడా యోగి నీడ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాజీనామా చేసిన స్వామి ప్రసాద్‌ మాయావతి ప్రధాన టీమ్‌లో కీలక పాత్ర పోషించి బీఎ్‌సపీ ప్రాభవానికి కారకుడయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 2017లో బీజేపీ ఘన విజయంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. తూర్పు యూపీలోని కుషినగర్‌ జిల్లాకు చెందిన స్వామి ప్రసాద్‌ ప్రభావం రాయ్‌బరేలీ, ఊంచాహార్‌, షాజహాన్‌ పూర్‌, బదయూన్‌ జిల్లాల్లోనూ ఉందని అంచనా. మొత్తం జనాభాలో 8 శాతం ఉన్న మౌర్యులు రాష్ట్రంలోని ఓబీసీల్లో యాదవులు, కుర్మీల తర్వాత అధిక శాతం ఉన్నారు.


నోనియా వర్గంలో దారాసింగ్‌ పెద్ద

యోగి ప్రభుత్వానికి రాజీనామా చేసిన రెండో మంత్రి దారా సింగ్‌ చౌహాన్‌ ఓబీసీల్లో అత్యంత వెనుకబడిన నోనియా కులానికి చెందిన నేత. తూర్పు యూపీలోని వారాణసీ, చందౌలీ, మీర్జాపూర్‌ ప్రాంతాల్లో ఈ వర్గీయులు 3 శాతం వరకు ఉన్నారు. నోనియాలకు చెందిన పృథ్వీరాజ్‌ జనశక్తి పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ చౌహాన్‌ కారణంగా సమాజ్‌వాదీ పార్టీకి బలం చేకూరినట్లయిందని అంటున్నారు. ఇక.. గురువారం రాజీనామా చేసిన ధరం సింగ్‌ సైనీ కూడా మరో ప్రముఖ బీసీ నేత. గతంలో బీఎస్పీలో పనిచేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన గత ఎన్నికల్లో స్వామి ప్రసాద్‌ మౌర్యతో కలిసి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన బాటలోనే సమాజ్‌వాదీతో చేతులు కలిపారు. బీఎ్‌సపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కుశ్వాహ్‌ వర్గ నేత ఆర్‌ఎస్‌ కుశ్వాహ్‌ కూడా రెండు నెలల క్రితమే సమాజ్‌వాదీలో చేరారు. కేంద్ర మాజీ మంత్రి, కుర్మీ నేత బేణీ ప్రసాద్‌ వర్మకు కుడిభుజంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే మాధురీ వర్మ కూడా అదే పార్టీలో ఇటీవల చేరారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ మనవడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌ కుమారుడు జయంత్‌ చౌధురి సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) కూడా సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకుంది.

Updated Date - 2022-01-17T09:26:44+05:30 IST