అక్రమార్కులతో మండల అధికారుల కుమ్మక్కు..

ABN , First Publish Date - 2021-01-19T13:26:19+05:30 IST

అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అక్రమార్కులతోనే కుమ్మక్కవుతున్నారని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల ప్రజా ప్రతినిధులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై పదుల సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు ...

అక్రమార్కులతో మండల అధికారుల కుమ్మక్కు..

మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధుల ఆగ్రహం 

అబ్దుల్లాపూర్‌మెట్: అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అక్రమార్కులతోనే కుమ్మక్కవుతున్నారని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల ప్రజా ప్రతినిధులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై పదుల సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షురాలు బుర్ర రేఖామహేందర్‌గౌడ్‌ అధ్యక్షతన సోమవారం హయత్‌నగర్‌లోని పరిషత్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మండల అధికారుల తీరుపై పలువురు సర్పంచ్‌, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులుగా తమను అధికారులు ఏమాత్రం గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఫోన్‌ చేసినా ఎందుకు లిఫ్ట్‌ చేయడం లేదని బాటసింగారం ఎంపీటీసీ వెంకటేష్‌ ఎంపీడీవో దేవేందర్‌రెడ్డిని నిలదీశారు. తారామతిపేట గ్రామ పరిధిలోని పలు లేఅవుట్‌లలో పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఎంపీటీసీ చేగూరి వెంకటేష్‌ ప్రశ్నించారు. అక్రమాలు చేసే వారితో ఎంపీడీవో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. తమ ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని వారితో అధికారులు చేతులు కలుపుతున్నారని విమర్శించారు. అక్రమ మైనింగ్‌ విషయంలో రైతులు, ప్రజలు ఆందోళనలు చేసినా మండల అధికారులు నేటికీ స్పందించకపోవడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలన్నారు. అక్రమంగా కొనసాగుతూ కాలుష్యం చిమ్ముతున్న పలు డాంబర్‌ ప్లాంట్లు, క్రషర్‌, రెడీమిక్స్‌ ప్లాంట్లను మూసి వేయాలని సంబంధిత శాఖల నుంచి ఆదేశాలు వచ్చినా మండల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బండరావిరాల 293/1 సర్వే నంబర్‌లో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ క్రషర్‌ యాజమాన్యం కబ్జా చేసిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీటీసీ అనితామహేందర్‌గౌడ్‌ ప్రశ్నించారు.  మైనింగ్‌ బాధిత రైతులకు కూడా న్యాయం చేయాలన్నారు. మజీద్‌పూర్‌లోని 306 సర్వే నంబర్‌లో ఓ ప్రైవేటు వ్యక్తి అధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని సర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చే జీతాల చెక్కులు కూడా పాస్‌ కావడం లేదని దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సివస్తోందని గుంతపల్లి సర్పంచ్‌ వెంకటేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీపీ రేఖామహేందర్‌ అధికారులకు సూచించారు. పార్కు స్థలాలు, ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జడ్పీటీసీ బింగి దేవదాసుగౌడ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్‌ ఎంపీపీ కొలన్‌ శ్రీధర్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌ అలీఖాన్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు గౌస్‌పాషాతోపాటు అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T13:26:19+05:30 IST