తెలుగు గాంధర్వం ఘంటసాల గానం

ABN , First Publish Date - 2021-12-04T06:29:25+05:30 IST

తెలుగుజాతి ఉన్నంతకాలం ఘంటసాల పాట ఉంటుంది. తన పాటద్వారా ఆయన భావి తరాలకు అందించింది భాషనే! ఆయన పాట నిలిచి ఉన్నంతకాలం తెలుగు నిలిచి ఉంటుంది. పాశ్చాత్య భాషా వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న.....

తెలుగు గాంధర్వం ఘంటసాల గానం

తెలుగుజాతి ఉన్నంతకాలం ఘంటసాల పాట ఉంటుంది. తన పాటద్వారా ఆయన భావి తరాలకు అందించింది భాషనే! ఆయన పాట నిలిచి ఉన్నంతకాలం తెలుగు నిలిచి ఉంటుంది. పాశ్చాత్య భాషా వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న నేటి తరం వారు ఘంటసాల పాటద్వారా తెలుగు భాషా మాధుర్యాన్ని తెలుసుకోగలుగుతున్నారు.


ఘంటసాల తెలుగువారి గుండె చప్పుడు. స్వాతంత్ర్యోద్యమ యోధుడు, మానవతావాది, సినీ నేపధ్య గాయకుడు. తెలుగుతల్లి గారాల స్వరపుత్రుడు. తన జీవితమే ఒక సందేశంగా జీవించినవాడు. తెలుగు భాషలోని తీయదనాన్ని పాటగా ఆలపించినవాడు. శాస్త్రీయ సంగీతానికి ఉన్నంత గౌరవాన్నీ, ప్రజాదరణనూ లలిత సంగీతానికీ కల్పించి సుసంపన్నం చేసినవాడు మన ఘంటసాల. ఆయన గళంనుంచి వెలువడినందునే కొన్ని పద్యాలు, శ్లోకాలు మరింత జనరంజకమైనాయి. ఆయన గానంలో సాధారణ రాగాలు కూడా ఆణిముత్యాల్లా ప్రకాశించాయి. తెలుగు భాషామాధుర్యానికి, తెలుగుపాటకి ఘంటసాల ఒక చిరునామా. ఘంటసాల వెంకటేశ్వరరావు అమరుడై నాలుగు శతాబ్దాలు గడిచినా ఈనాటికీ ఆయన పాటలు నిత్యనూతనంగానే అనిపిస్తాయి, వినిపిస్తాయి.

 

‘దేశభాషలందు తెలుగులెస్స’ అన్నది తెలుగు భాషలో నిగూఢమైన సంగీత మాధుర్యం వలనే! దక్షిణాదిలో గానకళకు తెలుగుభాషకు ఉన్నంత సౌలభ్యం తక్కిన భాషలకు లేకపోవటాన దాక్షిణాత్య సంగీత కళాకారులు తెలుగులో త్యాగరాజు ప్రభృతుల కృతుల్నే పాడతారు. ఘంటసాల వెంకటేశ్వరరావుగారు తన పాటల ద్వారా లోకానికి తెలుగులోని తీయదనాన్ని రుచి చూపించి, సినీ సంగీతంలో అజరామరుడైనాడు.


తెలుగుజాతి ఉన్నంతకాలం ఘంటసాల పాట ఉంటుందనే ప్రసిద్ధిని పొందారు. తన పాటద్వారా ఆయన భావి తరాలకు అందించింది భాషనే! ఆయన పాట నిలిచి ఉన్నంతకాలం తెలుగు నిలిచి ఉంటుంది. పాశ్చాత్య భాషా వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న నేటి తరం కనీసం ఘంటసాల పాటద్వారానైనా తెలుగు భాషా మాధుర్యాన్ని తెలుసుకో గలుగుతున్నారు. ఘంటసాల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఎంతటి కృషి ఉంటే అంతటి మహోన్నతుడౌతాడని ఆయన నిరూపించారు. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. అది సాధన ద్వారా సమకూరిన విలువలతో సిద్ధించిన అమృతభాండం! ఆ అమృతాన్ని ఆయన తన గానం ద్వారా లోకాస్సమస్తానికీ పంచి ఇచ్చారు.


1922 డిసెంబరు 4వ తేదీన కృష్ణాజిల్లా చౌటపల్లిలో తల్లిగారింట జన్మించారు. వారి స్వగ్రామం దివిసీమలోని టేకుపల్లి. తండ్రి సూరయ్య ఆ గ్రామంలో అర్చకులు. తరంగాలు పాడేవారు. ‘మృదంగం వీపుకు కట్టుకుని, నన్ను భుజం మీద ఎక్కించుకుని ఎక్కడ భగవత్సంకీర్తన జరిగితే అక్కడికి ఎంతదూరమైనా వెళ్లి మృదంగం వాయిస్తూ పాడుతూ నా చేత నృత్యం చేయిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో నన్ను అందరూ ముద్దుగా బాలభరతుడని పిలిచేవారు’ అని ఘంటసాల ఒక వ్యాసంలో రాశారు. 


ఘంటసాల 11వ యేటనే తండ్రి మరణించారు. దీంతో యాయవారం చేసుకుంటూ జీవితం గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి అవసాన దశలో దగ్గరకు తీసుకుని ‘సంగీత విద్యలో తరించు’ అని ఆదేశించారట. దీంతో తండ్రి కోరిక తీర్చటానికి పెద్ద కళ్లేపల్లి గ్రామంలో సుసర్ల కృష్ణబ్రహ్మశాస్త్రి వద్ద సంగీతం నేర్చుకోవటానికి వెళ్లారు. గురువుగారికి సేవలు చేయటం, వారాలు చేసి పొట్ట నింపుకోవటం తప్ప సంగీతం గీతాల స్థాయి దాటలేదు. దీంతో కొడాలిలో ఘంటసాల నాగభూషణం గారనే సంగీత విద్వాంసుడు వద్ద్దకు వెళ్లారు. అక్కడ సంగీతం పెద్దవర్ణాల వరకూ మాత్రమే వచ్చింది.


ఉత్తర సర్కారు జిల్లాల్లో ఆ రోజుల్లో విజయనగరంలో మాత్రమే సంగీత కళాశాల ఉండేది. ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ప్రిన్సిపాల్. ఘంటసాల ఆయన్ని కలిసి సంగీతభిక్ష అర్థించారు. ఎల్లమ్మ గుడిలో పడుకుంటూ, వారాలు చేసుకుంటూ మహరాజా సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోసాగారు. అప్పుడు ఆ సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా ఉండే పట్రాయని సీతారామశాస్త్రి. ఘంటసాలకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, ఆదరించారు. భుజాన జోలె తగిలించుకుని వీధీవీధీ తిరిగి మధూకరం ఎత్తి పొట్ట పోషించుకున్న ఘంటసాల ఆ తరువాత ఎంత సంపదగలిగినప్పటికీ ఈ గతాన్ని ఏనాడూ మరచిపోలేదు. జీవితాంతం గురుభక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. గురుపుత్రుడు పట్రాయని సంగీతరావుని మద్రాసు పిలిపించుకుని తన సహాయకుడిగా నియమించుకున్నారు కూడా! ‘ఏనాడు ఏ తల్లి మొదటి కబళం నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్య పూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించింది..’ అని వ్రాసుకున్నారు ఘంటసాల కృతఙ్ఞతాపూర్వకంగా!


ఘంటసాల కళకళ కోసమేనన్నట్టుగా జీవించిన వారు కాదు. పూట గడవటం కష్టంగా ఉన్న రోజుల్లోనూ ఆయన దేశభక్తిని వదల్లేదు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18మాసాలు కారాగార శిక్ష అనుభవించారు. జైలులో బెజవాడ గోపాలరెడ్డి, పొట్టి శ్రీరాములు, బి.ఎస్. మూర్తి వంటివారి సాహచర్యం లభించాయి. ‘జైలు జీవితం నాకు ఎన్నో విధాలుగా మహోపకారం చేసింది. కర్తవ్యదీక్ష, స్థిరసంకల్పం, నియమబద్ధమైన జీవితం నేర్పింది’ అని ఘంటసాల చెప్పుకున్నారు. దేశభక్తి గీతాలను హృదయపూర్వకంగా, ఉత్తేజకరంగా పాడేవారు. 1972లో భారత స్వాతంత్ర్య రజతోత్సవ వేడుకల్లో ఘంటసాలవారి దేశభక్తి గీతాలాపన వినే అవకాశం నాకు లభించింది. వారిని ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి, ఆఖరుసారి కూడా. సర్వోదయ సభలలో, హరిజన సమావేశాలలో తగిన గేయాలు పాడి, ఉపన్యాసాలు చేసి నా కర్తవ్యాన్ని పాటిస్తున్నానని తృప్తి పడుతుంటానని ఘంటసాల పేర్కొన్నారు.


‘స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండి’, ‘ఆ మొగల్ రణధీరులు’, ‘అమ్మా! సరోజినీదేవీ’ మొదలైన ఘంటసాల ప్రైవేట్ రికార్డులు ఎంతగానో ప్రజాదరణ పొందాయి. అలాగే, తన పాటలతో నాటి ఆంధ్రోద్యమానికి ఊపిరి పోయటమే కాకుండా పొట్టి శ్రీరాములు మరణించినప్పుడు వారి అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ వెంటఉండి ప్రార్థనాగీతాలు పాడి అమరజీవికి నివాళులర్పించారు. రాష్ట్రావతరణం సందర్భంలో తెలుగు జాతిని ప్రబోధిస్తూ ఎన్నో గీతాలూ పద్యాలూ పాడారు. అనేక పాటలతో తెలుగు జాతికి మేల్కొల్పులు చేశారు. ఘంటసాల స్వీయ రచనలు ‘బహుదూరపు బాటసారీ’, ‘మరువలేనె మరువలేనె నా వలపురాణి’ ఎంతగానో ప్రచారం పొందాయి. 


ఏ గాయకుడయినా స్వభాషలో పాడటానికి, పరభాషలో పాడటానికీ తేడా ఉంటుంది. మాతృభాషలో పాడుతున్న గాయకుడి గొంతులో అప్రయత్నంగా వినిపించే స్వేచ్ఛ, స్వచ్ఛత- ఆ భాష రానివారు పాడుతున్నప్పుడు ఎలా సాధ్యమౌతాయని ఘంటసాల అనేవారు. తమిళ చిత్రాలలో పాడమని నిర్మాతలు అడిగినప్పుడు తమిళ గాయకులను కాదని తన చేత పాడించవద్దని చెప్పేవారు. ఆయన ఎంతటి మానవతామూర్తో అంతటి వినయమూర్తి కూడా! ‘అమ్మా!’, ‘బాబూ!’, ‘నాయనా! అంటూ ఆత్మీయంగా మాట్లాడేవారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆపన్నులను ఆదుకోవటానికి అందరికన్నా ముందు ముందుకొచ్చేవారాయన. పాటలు పాడి ప్రజలకు వినిపిస్తూ ధన సేకరణకు తోడ్పడేవారు. చైనా పాకిస్తాన్ దురాక్రమణల సమయాల్లోనూ, తుఫాను బాధితులకోసం, అనేక సాంఘిక కార్యక్రమాల కోసం ఉచితంగా సంగీత కార్యక్రమాలు అందించి తోడ్పడేవారు. ‘నేను తలపెట్టిన ప్రతి సాంఘిక సేవా కార్యక్రమానికీ నేనున్నానంటూ ఘంటసాల ప్రథమంగా ముందుకు వచ్చేవారు’ అని ఎన్.టి. రామారావు పేర్కొన్నారు.


1974లో ఘంటసాల మరణించిన వార్త విన్నవెంటనే ఆనాటి విద్యా సాంస్కృతిక శాఖామంత్రి, మా నాన్నగారు మండలి వెంకట కృష్ణారావు విజయవాడలోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ఘంటసాల పేరు పెడుతున్నట్టు రాష్ట్రప్రభుత్వం పక్షాన ప్రకటించారు. యస్.పి. బాలసుబ్రహ్మణ్యం 1993 ఫిబ్రవరిలో హైదరాబాదులో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేశారు. రెండవ విగ్రహాన్ని 1999 ఫిబ్రవరిలో ఘంటసాల స్వగ్రామమైన టేకుపల్లిలో ప్రతిష్ఠింపచేసే అవకాశం నాకు లభించింది. ఈ రోజు ఘంటసాల విగ్రహంలేని పట్టణమంటూ లేదు. ఏ సంగీతకారునికీ లభించని ఆదరణ తెలుగునాట ఆయనకు లభించింది. తరాల అంతరాలను దాటి తన గళం ద్వారా నాటినుండి నేటి దాకా చిరంజీవిగానే ఉన్నారు. తెలుగు పాట ఉన్నంతకాలం ఘంటసాల జీవించే ఉంటారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, జయంతులు, వర్థంతులు ఊరూవాడా జరుగుతూనే ఉన్నాయి. 


ఇటీవల దివంగతుడైన ఘంటసాల వారి పెద్దబ్బాయి రత్నకుమార్ తండ్రి పేరున మ్యూజియం పెడితే వారువాడిన కళ్లజోడు, చెప్పులు, గ్రామఫోను రికార్డులన్నీ ఇస్తానని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మ్యూజియం నిర్మాణం కోసం 2 కోట్లు కేటాయించారు కూడా! కానీ, స్థల నిర్ణయం జరగకపోవటంతో ఘంటసాల మ్యూజియం ప్రతిపాదన కాగితాలపైనే ఉండిపోయింది. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలోని స్వరశాల తరహాలో ఆ మ్యూజియంలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఘంటసాల పాటలను వినే ఏర్పాటు చేయాలని భావించాం. శత జయంతి సంవత్సరంలోనైనా ఘంటసాల మ్యూజియం ఏర్పడితే సంగీతాభిమానులు ఎంతో సంతోషిస్తారు.


(నేడు హైదరాబాద్ రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు ఘంటసాల శతజయంతి వేడుకలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ప్రారంభిస్తారు. మండలి బుద్ధప్రసాద్, కె.వి.రమణాచారి, తమ్మారెడ్డి భరద్వాజ, బ్రహ్మానందం తదితరులు పాల్గొంటారు).


మండలి బుద్ధప్రసాద్


Updated Date - 2021-12-04T06:29:25+05:30 IST