ముంబై, బెంగళూరు ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-04-05T13:14:22+05:30 IST

అసోం రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది....

ముంబై, బెంగళూరు ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి

అసోం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

గువహటి (అసోం): అసోం రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ముంబై, బెంగళూరు నగరాల నుంచి అసోంకు విమానాలు, రైళ్లలో వస్తున్న ప్రయాణికులకు కొవిడ్-19 పరీక్షలు తప్పనిసరి చేయాలని అసోం రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అసోం రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని, ప్రజలు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని అసోం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంతబిశ్వాశర్మ ప్రకటించిన రెండో రోజే ముంబై, బెంగళూరు నగరాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్ సిన్హా ఉత్తర్వులు జారీచేశారు.


మాస్కు ధరించాల్సిన అవసరం లేదని మంత్రి వ్యాఖ్యలను ప్రజలు ఎగతాళి చేసిన తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలతో పోలిస్తే అసోంలో కొవిడ్ వ్యాప్తి లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంతబిశ్వాశర్మ మళ్లీ ట్వీట్ చేశారు.కరోనా వ్యాప్తి లేనందున అసోంలో ఈ ఏడాది ఏప్రిల్ 14వతేదీన అస్సాం నూతన సంవత్సర వేడుక బిహును జరుపుకుంటామని మంత్రి ప్రకటించారు. ముంబై, బెంగళూరు నగరాల నుంచి అసోం వచ్చిన ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్సలు చేసి క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్ష నివేదిక సమర్పించాలని అసోం సర్కారు ఆదేశించింది.


పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. కరోనా పరీక్ష రిపోర్టు వచ్చే దాకా వారి సొంత ఖర్చుతో విమానాశ్రయ ప్రాంగణంలోనే వేచి ఉండాలని సర్కారు ఆదేశించింది. కరోనా పాజిటివ్ రోగుల కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. అసోంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.500 లను వసూలు చేయాలని నిర్ణయించారు. అసోంలో గత 24 గంటల్లో 68 కరోనా కేసులు నమోదైనాయి. రాష్ట్రంలో తాజాగా మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 598గా నమోదైంది.

Updated Date - 2021-04-05T13:14:22+05:30 IST