Abn logo
Jul 30 2021 @ 00:00AM

ఉపాయ కుశలత

కష్టాల్లో కుంగిపోకుండా, సుఖాల్లో పొంగిపోకుండా సంయమనం పాటించాలంటుంది బౌద్ధం. అంతే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కలవరపడితే మన మానసిక శక్తులు కుంచించుకుపోతాయి. సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపలేవు. మరింత లోతున పడేస్తాయి. అదే మనం దిగాలు పడకుండా దిటవుగా నిలబడితే... కష్టాలను తొలగించుకొనే మార్గాలు కనిపిస్తాయి. అలాంటి మార్గాన్వేషణలో మనిషి తన ఉపాయ కుశలతను ప్రదర్శించాలంటాడు బుద్ధుడు. అటువంటి ఒక ఉపాయశాలి గురించి ఆయన చెప్పిన కథ ఇది.


పూర్వం జంబూద్వీపంలో, ఒక నిరుపేద కుటుంబంలో బోధిధరుడు పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అతని మిత్రులందరూ తక్షశిలకు వెళ్ళి, విద్యలు నేర్చుకొనేవారు. తాను కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు. కానీ ఆ స్తోమత లేదు. అయినా తల్లితండ్రులకు నచ్చజెప్పి తక్షశిలకు వెళ్ళాడు. అక్కడే ఒక గురువును కలిసి, తన పేదరికం గురించి చెప్పుకున్నాడు. 


‘‘గురువర్యా! గురుదక్షిణ లేకుండా విద్యను అభ్యసించడం మంచిది కాదు. నేను తమకు ఇప్పుడు ఏమీ సమర్పించలేను. కానీ విద్య ముగిశాక యాచించి, ధనాన్ని తెచ్చి, మీకు సమర్పిస్తాను’’ అని చెప్పాడు.

గురువు సంతోషించి ‘‘సరే!’’ అన్నాడు. గురుదక్షిణ కన్నా బోధిధరుడిలో దక్షతను ఆ గురువు చూడగలిగాడు. అందుకే అతను అడిగిన వెంటనే తన శిష్యుడిగా చేర్చుకోవడానికి అంగీరకించాడు.

కొన్నాళ్ళకు బోధిధరుడి విద్యాభ్యాసం పూర్తయింది. ‘‘గురుదేవా! నా మాట ప్రకారం యాచించి, దక్షిణ తెచ్చి ఇస్తాను. అనుమతి ఇవ్వండి’’ అని కోరాడు. 

‘‘అలాగే...వెళ్ళి రా!’’ అన్నాడు గురువు. 

బోధిధరుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. తన గురించి చెప్పాడు ఎందరో కాదనకుండా, లేదనకుండా శక్తి కొలదీ సహాయాన్ని అందించారు. ఇలా వచ్చిన వాటన్నిటినీ బంగారు నాణేలుగా మార్చుకున్నాడు. గురుదక్షిణ సమర్పించడం కోసం తక్షశిలకు బయలుదేరాడు. 


దారిలో ఒక నది అడ్డుగా ఉండడంతో... పడవ మీద ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో గాలి వీచింది. సుడి రేగింది. పడవ కొద్దిగా పక్కకు ఒరిగింది. అతని జేబులోని బంగారు నాణేల మూట నదిలో పడిపోయింది. నావికుడు పడవను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు. కానీ... గురుదక్షిణ మొత్తం గంగపాలైంది. 

ఈ విషయం తెలిసి అక్కడున్నవారందరూ విచారపడ్డారు. ‘‘మళ్ళీ గ్రామాలకు పోయి యాచించు’’ అని సలహా ఇచ్చారు.

కానీ ఆ సొమ్మును రాజు దగ్గర నుంచి సంపాదించాలనుకున్నాడు బోధిధరుడు. వెంటనే తన బుద్ధికుశలతను ఉపయోగించాడు. ఆ నదీ తీరంలో... ఇసుకలో కూర్చొని మౌనవ్రతం పట్టాడు. తిండి మానేశాడు. అలా రోజంతా గడిచింది. అక్కడి నుంచి బోధిధరుడు కదల్లేదు. 

సమీప గ్రామాల ప్రజలు ఎందరో వచ్చి అతణ్ణి పలకరించారు. ‘‘ఎందుకిలా చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘ఆహారం తీసుకోండి’’ అని అర్థించారు. బోధిధరుడి నుంచి వారికి ఎలాంటి సమాధానం రాలేదు.

రెండు రోజులు గడిచాయి. ఈ వార్త దేశమంతా పాకింది. రాజుగారికి చేరడంతో, తన మంత్రులను పంపాడు. వారు ప్రశ్నించినా బోధిధరుడు ఉలకలేదు, పలకలేదు.

చివరకు రాజే తరలివచ్చాడు. ‘‘ఎవరు నీవు? ఇక్కడ ఎందుకు నిరాహారంగా, మౌనంగా కూర్చున్నావు?’’ అని అడిగాడు. 

అప్పుడు బోధిధరుడు నోరు తెరచి మాట్లాడాడు. తన చరిత్ర చెప్పాడు. 

రాజు ఆశ్చర్యపడి ‘‘ఈ విషయం నాతోనే ఎందుకు చెప్పావు? మిగిలినవారికి ఎందుకు చెప్పలేదు?’’ అని అడిగాడు. 

‘‘రాజా! మనం సమయా సమయాలు ఎరిగి సహాయాన్ని అర్థించాలి. ఎవరు మన కష్టాలను తీర్చగలరో వారికే చెప్పుకోవాలి. అలాకాని వారికి చెప్పడం వల్ల మన కష్టం తీరదు సరికదా... హేళనకూ, అవమానానికీ గురవుతాం. మనిషి కష్టం రాగానే కలతపడి, కనబడిన ప్రతివారితో చెప్పుకోకూడదు. తీర్చగలవారు దొరికేవరకూ ఆ కష్టాన్ని దిగమింగుకొని భరించాలి. చాలా రోజులపాటు ఎన్నో గ్రామాలు తిరిగి, ఎందరెందరి నుంచో తీసుకున్న డబ్బు గంగపాలైంది. అంత సహాయాన్ని అందించగలవారు మీరొక్కరే. అందుకే మీతోనే మాట్లాడాను’’ అన్నాడు. 

బోధిధరుడి ఆలోచనలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే గురుదక్షిణకు కావలసినన్ని బంగారు నాణేలు ఇచ్చాడు. అతణ్ణి తన కొలువులో ఆస్థాన పండితుడిగానే కాదు, తన ఆంతరంగికుడిగానూ నియమించుకున్నాడు.


 బొర్రా గోవర్ధన్‌