Abn logo
Sep 25 2021 @ 00:12AM

ఆళ్ల.. మీకు విలువల్లేవు..

. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గంజి చిరంజీవి, పోతినేని, గూడూరు వెంకట్రావు

అందుకే అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారు..

దమ్ముంటే రాజీనామా చేయండి..

టీడీపీ నేతల సవాల్‌


 మంగళగిరి, సెప్టెంబరు 24: రాజకీయాల్లో మీకు విలువల్లేవు... నైతికత అసలే లేదు... దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక విషయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. అధికారం చేతిలో ఉందని పోలీసులు, గూండాలను వినియోగించుకుని అడ్డదిడ్డంగా పదవిని ఎగరేసుకుపోదామనుకుంటే కుదరదని టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రండి... మా పార్టీ తరపున లోకేశ్‌ పోటీచేస్తారు. 60వేల పైచిలుకు మెజారిటీతో టీడీపీ గెలిచి తీరుతుంది. అలా జరుగని పక్షంలో మంగళగిరిలో మేము రాజకీయాలను మానేస్తామని పోతినేని ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు.  టీడీపికి చెందిన తొమ్మిది మంది సభ్యుల్ని పోలీసుల సాయంతో మీ గూండాల చేత కిడ్నాప్‌ చేయించేందుకు 20వ తేదీ సాయంత్రం నుంచి తంటాలు పడుతున్నారని ఆరోపించారు. కోరం లేదని చెబుతూనే అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ పదవులకు ఒక్కో నామినేషన్‌ వంతున వచ్చాయని.. సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తున్నామని రిటర్నింగ్‌ అధికారిచేత చెప్పించారు.  కోరం లేకుండా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను నిర్వహించరాదని పంచాయతీరాజ్‌ చట్టం జీవోనెం. 173...సెక్షన్‌ 9అండ్‌ 20 చెబుతున్నాయి. అలాంటప్పుడు రిటర్నింగ్‌ అధికారి చట్టాలకు విరుద్ధంగా ఎలా మాట్లాడతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రిటర్నింగ్‌ అధికారి చట్టవ్యతిరేకంగా నడుచుకోవడాన్ని గురించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తమ పార్టీ ఫిర్యాదు చేసిందని పోతినేని, చిరంజీవి తెలిపారు.